Telangana Governer Prajadarbar : రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించుకున్నారు.  రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటగా మహిళా దర్బార్ ను ప్రారంభిస్తున్నారు. ఈ నెల 10న రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు  ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మొదటి ప్రజాదర్భార్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు.


ఫోన్, మెయిల్ ద్వారా గవర్నర్ అపాయింట్‌మెంట్ 


మహిళలు తమ సమస్యను గవర్నర్‌కు చెప్పుకోవాలంటే.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. 040-23310521 నెంబర్‌కు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ ఖరారు చేసుకోవచ్చు లేదా ajbhavan-hyd@gov.in కు మెయిల్ చేసి.. రిక్వెట్ పెట్టుకోవచ్చు. రాజ్ భవన్ వర్గాలు సమయాన్ని సమాచారం పంపుతాయి. అప్పుడు వెళ్లి మహిళలు గవర్నర్‌కు తమ సమస్యను చెప్పుకోవచ్చు. 
ఈ కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో నెలకోసారి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మహిళల నుంచి సమస్యలు, విజ్ఞప్తులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలతో రాజ్‌భవన్‌ సచివాలయం ప్రజాదర్బార్‌ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 


ప్రజా దర్భార్ లో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా ప్రయత్నం


అంతే కాక రాజ్‌భవన్‌ సచివాలయం అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై పనిచేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. అదే ఫైల్‌ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా బాధితులు ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభించిందా? అవి ఏ దశలో ఉన్నాయి? ఏ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి? ఇలాంటి విషయాలు తెలుసుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.  ప్రగతి భవన్‌ లో ప్రజలకు ఎంట్రీ లేదని.. సమస్యలు వినేవారు లేరని విమర్శలు వస్తున్న  గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది.  


ప్రభుత్వం సహకరిస్తుందా ?


 గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు లేవని , ఈ కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వంకూడా అసంతృప్తిగా ఉంది. అందుకే ఇటీవలి కాలంలో గవర్నర్‌తో ముఖ్యమంత్రి ఎడ మొహం - పెడ మొహంగా ఉంటున్నారని చెబుతున్నారు. సీఎం ఎలా ఉన్నా.. తాను ప్రజాదర్భార్ నిర్వహించి తీరాలని గవర్నర్ పట్టుదలగా ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సహకరిచకపోతే సమస్యలు పరిష్కారం కావని.. యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని కొంత మంది గుర్తు చేస్తున్నారు.