Telangana Governor Not approved the BC Reservations Bill: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారని జరుగుతున్న  ప్రచారంలో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వేషన్ల పై ఎలాంటి  నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు.  ఇంకా పెండింగ్ లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు ఉంది. మున్సిపాలిటీల విలీనం కు సంబంధిచిన గెజిట్ నోటిపికేషన్ ప్రింటింగ్ కు సంబందించిన మెమో జారీతో గందరగోళం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. పలు గ్రామ పంచాయితీ లను మున్సిపాలిటీ లో వీలీనం చేస్తూ మెమో జారీ చేశారు. అయితే ఈ మెమోను చూసిన కొంత మంది.. బిల్లుకు ఆమోద ముద్ర వేశారని అనుకున్నారు. అదే ప్రచారం చేయడంతో విస్తృతంగా ప్రచారం అయింది. ఇంకా అది రాజ్ భవన్ పరిశీలనలోనే ఉంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 50%కు పరిమితం చేశారు. దీనిలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% కేటాయించారు.  అయితే, రాష్ట్రంలో బీసీల జనాభా 56%కి పైగా ఉండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిమితిని తొలగించి బీసీలకు 42% కోటా అమలు చేయాలని నిర్ణయించింది. దీనితో మొత్తం రిజర్వేషన్ 63%కి చేరుతుంది . 

గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ (ఎంపీపీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ)ల్లో బీసీలకు 42% సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.   పట్టణ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బీసీలకు 42% కోటా ఇవ్వాలనుకున్నారు. అందుకే అసెంబ్లీలో బిల్లులు ఆమోదించారు. ఆగస్టు 31న బిల్లులు పాసైన తర్వాత, సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ ,  సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  సహా  అన్ని పార్టీల నాయకులు గవర్నర్‌ను కలిసి మెమోరాండం సమర్పించారు. "అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారు..  త్వరగా ఆమోదించాలి" అని కోరారు. అయితే ఇది రాజ్యాంగ పరమైన సంక్లిష్టతలతో కూడిన బిల్లు కావడంతో గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు 42% కోటా ఇస్తామని వాగ్దానం చేసింది. బీఆర్ఎస్ పాలనలో 2018 చట్టం ద్వారా 50% క్యాప్ విధించడం వల్ల బీసీలు  నష్టపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.   అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లులో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయని.. అది రాజ్యాంగ విరుద్ధమన్న అభిప్రాయం రాజ్యాంగనిపుణుల్లో ఉంది.  ఇప్పటికే ఓ సారి ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఉంది. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారా తిరస్కరిస్తారా అన్నదానిపై స్పష్టతలేదు. ఈ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు  కావడంతో విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బిల్లును గవర్నర్ ఆమోదించడం అసాధారణమే అవుతుందని అంటున్నారు.                                        

మొత్తానికి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ఆమోదం పొందనట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.