TSPSC Members: TSPSC సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదం - కొత్త టీం ఇదే, ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం

TSPSC: టీఎస్ పీఎస్సీ సభ్యుల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. మొత్తం ఐదుగురికి సభ్యులుగా అవకాశం కల్పించారు.

Continues below advertisement

TSPSC Members Appointment: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) నియామకానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు మరో కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజినికుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమించారు. గతంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్ పీఎస్సీ (TSPSC) సభ్యులు రాజీనామా చేశారు. దీంతో కమిషన్ ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. యూపీఎస్సీ తరహాలోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో టీఎస్ పీఎస్సీ కొత్త టీం సిద్ధమైంది. ఈ క్రమంలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Continues below advertisement

ఛైర్మన్ మహేందర్ రెడ్డి గురించి

టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా నియమితులైన మహేందర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామం. ఆయన 1986వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఆయన రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పని చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించిన మహేందర్ రెడ్డి.. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ కమిషనరేట్ కు మొదటి కమిషనర్ గా నియమితులయ్యారు. మూడేళ్లు సైబరాబాద్ సీపీగా సుదీర్ఘంగా సేవలందించి పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తర్వాత గ్రేహౌండ్స్, పోలీస్ కంప్యూటర్ విభాగాల్లో విధులు నిర్వహించారు. కీలక ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగానూ పని చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి.. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017 నవంబర్ లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ వరకూ ఆ పదవిలో కొనసాగారు. తాజాగా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 

ఉద్యోగాల భర్తీపై ఫోకస్

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త టీం సిద్ధం కావడంతో ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. గతంలో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకుని అలాంటివి రిపీట్ కాకుండా పక్కాగా పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ సహా గ్రూప్‌-2 పరీక్షలతో పాటు ఇప్పటివరకూ పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరును పరిశీలించనుంది. తర్వాత అధ్యయన నివేదిక సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. 

 Also Read: ACB Raids: బాలకృష్ణ ఇంట్లో సోదాలు పూర్తి, కోట్లాది అక్రమ సంపద గుర్తింపు! మిగతా HMDA అధికారుల్లో గుబులు

Continues below advertisement
Sponsored Links by Taboola