HMDA Former Planning Director: హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్, రెరా సెక్రటరీగా బాలక్రిష్ణ పని చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సమీప బంధువులు, ఆయన స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆయన ఇంట్లో రూ.84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్ లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఏకరాల భూమి గుర్తించాం. భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తించాం. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుంది. మొత్తం ప్రాపర్టీస్ వ్యాల్యు రూ.75 కోట్ల మార్కెట్ విలువ ఉంటుంది. ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి. శివ బాల కృష్ణపై కేసు నమోదు చేసి, రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తం. తదుపరి కస్టడీకి తీసుకుంటాం. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.
మిగతా అధికారుల్లో టెన్షన్
శివ బాలకృష్ణ అరెస్ట్ తో HMDAలో పనిచేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. HMDA పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా.. గతంలో అనుమతుల ఇచ్చిన ఫైల్స్ అన్నింటిని పరిశీలించే యోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ కి అనుమతుల్లో వారు భారీగా లంచాలు పొందినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ రెండురోజుల ముందు భారీ ఎత్తున లాండ్ కన్జర్ వేషన్ జరిగిందని తెలుస్తోంది. ఉప్పల్ లో బాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా సోదాలు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలకృష్ణ సోదరి ఇద్దరు కొడుకులు హెచ్ఎండీఏలో బాలక్రిష్ణ దగ్గరే పని చేశారు. బాలకృష్ణ సోదరి కొడుకులు ఇద్దరు బాలకృష్ణ బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించారు.
హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పరిధిలో సైతం భారీగా భూ మార్పిడి జరిగిందని సమాచారం. ఆ రెండు రోజుల్లో రూ.200 కోట్ల భూములు చేతులు మారినట్టు ఏసీబీ గుర్తించింది.