Governor Decision on Resignation of TSPSC Chairman : టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలను(Resignations) గవర్నర్ తమిళి(Governor Tamilisai)సై బుధవారం ఆమోదించారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే.. కొత్త బోర్డును ఏర్పాటు చేసి.. ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ క్రమంలో చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు.
పేపర్ లీకులతో టీఎస్ పీఎస్సీపై విమర్శలు..
గత చైర్మన్ , బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని గవర్నర్ సూచించారు.పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి గవర్నర్ అనుమతించారు. నిన్న (మంగళవారం) సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరి రాజీనామాలను ఆమోదించడానికి తమకు అభ్యంతరం లేదని లేఖ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో వెంటనే స్పందించి చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలను ఈరోజు తమిళిసై ఆమోదించారు. పేపర్ లీకేజీ లాంటి విషయాలను సీరియస్ గా తీసుకుని.. సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ గట్టిగా సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్ లో ఆటలాడకుండా.. కఠినమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కొత్త సభ్యుల నియమాకం తరువాత జాబ్ నోటిఫికేషన్లు
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియమాకానికి లైన్ క్లియర్ అయింది. కొత్త సభ్యుల నియమాకం తరువాత జాబ్ నోటిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తరహాలో పటిష్ఠమైన వ్యవస్థగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని సాయం కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జనవరి 5న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి ఇక్కడి యూపీఎస్సీ భవన్‌లో ఛైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో భేటీ అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తిచేయడం అభినందనీయమని ప్రశంసించారు.
రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపట్టనున్నట్లుగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కమిషన్‌లో అవకతవకలకు తావులేకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తోపాటు, సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారు. ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.