Committee on Dharani Portal: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణిలో భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసింది. ధరణి పోర్టల్(Dharani Portal)లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా... ఐదుగురు సభ్యులతో కమిటీ(Five Member Committee)ని నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పేరుతో భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలను కూడా వెలికితీయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ధరణిపై వేసిన కమిటీలో కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్... నవీన్ మిత్తల్(Naveen Mittal) కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి(M. Kodanda Reddy), మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా పని చేసిన రేమండ్ పీటర్(Raymond Peter)ను ఈ కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. భూ చట్టాల నిపుణుడు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్(Sunil), రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్(B. Madhusudan)ను కూడా ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ... ధరణి పోర్టల్లోని సమస్యలను గుర్తించి.. వారికి పరిష్కారాలను కనుగొని ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఈ నివేదిక ఇవ్వాలని.. కమిటీని ఆదేశించింది రేవంత్‌రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని భూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ కమిటీ పనిచేయనుంది.
ధరణి పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూములు దోచుకుందని కాంగ్రెస్ (Congress) పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే... ధరణిని బంగాళాఖాతం వేస్తామని పదేపదే ప్రకటించింది. అంతేకాదు... ధరణి స్థానంలో భూమాత(Bhoomatha)ను తీసుకొస్తామని కూడా ఎన్నికల ముందు ప్రకటించింది కాంగ్రెస్. ఈ క్రమంలో ముందుగా ధరణిలో సమస్యలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పేరుకుపోయన భూ సమస్యలకు కారణమైన పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదని, రెవెన్యూ అకారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్‌లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్‌లో సమస్యలను తొలగించి సరికొత్తగా రూపొందించాలని నిర్ణయించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ దిశగా ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేయనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
2020 అక్టోబరు 29న ధరణిని ప్రారంభించింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాల జారీ చేస్తున్నారు. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ధరణి పోర్టల్‌తో లక్షల్లో పెండింగ్ సమస్యలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్‌ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త సమస్యలు తలెత్తకుండా... ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుకోవడంలో భాగంగానే ఈ కమిటీని ప్రభుత్వం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో 33 మాడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చినా... భూముల సమస్యలు పరిష్కారం కాలేదు. అందుకే భూమాత పోర్టల్ తీసుకురావడానికి ముందే... ఉన్న సమస్యలకు పరిష్కరించి.. అవి మళ్లీ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం నియమించిన ఈ ఐదుగురు సభ్యుల కమిటీ జిల్లాల్లో పర్యటించి.. భూ సమస్యలపై అధ్యయనం చేయనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుగొని... వాటి పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.