Telangana government sends BC reservation ordinance to Governor : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ లో పొందుపరిచారు. 285(A) సెక్షన్ లో సవరణలు చేస్తూ ఈ ఆర్డినెన్స్ రూపొందించారు. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారుచేసి.. నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (Backward Classes) రిజర్వేషన్లను 42 శాతం  కి పెంచేందుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లో సవరణలు చేసే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తే.. కొన్ని చట్టపరమైన సమస్యలు వస్తాయి. సుప్రీం కోర్టు రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50 శాతంగా నిర్దేశించింది. ఆర్డినెన్స్ జారీ చేస్తే తెలంగాణలో 42 శాతం బీసీ, 18 శాతం ఎస్సీ,   10 శాతం ఎస్టీ రిజర్వేషన్లతో మొత్తం 70 శాతానికి చేరుతుంది, ఇది సుప్రీం కోర్టు పరిమితిని మీరుతుంది. ఈ అంశం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వడంలో అడ్డంకిగా ఉండవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 213(1)(a) ప్రకారం, రాష్ట్రపతి ముందస్తు ఆమోదం అవసరమయ్యే విషయాలపై గవర్నర్ ఆర్డినెన్స్‌ను జారీ చేయరని అంటున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం కుల గణన  ఆధారంగా 42 శాతం  రిజర్వేషన్‌ కల్పించడానికి అవసరమైన డాటాను సమర్పించింది. ఈ డేటాకు ఎలాంటి  చట్టపరమైన సాధికారత ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు.  కులగణన ఆధారంగా బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్ పెంచినప్పుడు పాట్నా హైకోర్టు దానిని రాజ్యాంగ విరుద్ధంగా  పేర్కొని రద్దు చేసింది. ఇక్కడా అలాంటి పరిస్థితి రావొచ్చని భావిస్తున్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తే విషయం కోర్టులుక వెళ్తుంది. లేకపోతే..గవర్నర్ వద్దే ఆగిపోతుంది. ఈ ఆర్డినెన్స్ విషయంలో ఎలా చూసినా..  వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. 

బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించింది. ఆ ప్రకారం కులగణన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. వాటి ఆధారంగా  ఓ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సిఫారసుల ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని బిల్లులను ఆమోదించి.. కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం ఆ బిల్లులు కేంద్రం వద్ద ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న బిల్లులపై.. ఆర్డినెన్స్ జారీ చేయడం కూడా చెల్లదన్న వాదనను కొంత మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.                          

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గతంలో త్రిపుర గవర్నర్‌గా ఉన్నప్పుడు రాజ్యాంగ సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించిన రికార్డు ఉంది. తెలంగాణలో కూడా, ఆయన రాజ్యాంగ విధులను కఠినంగా పాటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిష్ణుదేవ్ వర్మ..ఈ ఆర్డినెన్స్ ను న్యాయ, రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే..నిర్ణయం తీసుకునేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.