Telangana Teachers Transfers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Government Teachers) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో 8వ తేదీ శనివారం నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు.
ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభం
కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ జరగనుంది. పదవీ విరమణ 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
అసలైన శుభవార్త అదే
చాలా కాలంగా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. టెట్‌తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి చేసింది. దానికి రేవంత్ సర్కార్ స్వస్తి చెప్పింది. మల్టీజోన్ 1లో ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ అంతా 15 రోజులు కొనసాగనుంది. మల్టీజోన్ 2లో ఈ నెల 8వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. 23 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తికానుంది.
గత ఏడాదిలో జరగాల్సి ఉంది
ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ అంతా గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరగాల్సి ఉంది. అయితే ప్రమోషన్లకు టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బదిలీలు, ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అలాగే జీవో 317పై రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు కోర్టును ఆశ్రయించారు. ఇతర జిల్లాల నుంచి టీచర్లు తమ జిల్లాలకు వస్తే తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నామని హైకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే అప్పటికే మల్టీ జోన్-1 (వరంగల్) గెజిటెడ్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు, బదిలీలు పూర్తయింది. 782 మందికి పదోన్నతి దక్కింది.
నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు
అలాగే స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్‌ఫర్లు పూర్తయ్యాయి. కానీ వారి ప్రమోషన్లు పూర్తి కాలేదు. వాళ్లందరిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు, వీటితో పాటుగా ఎస్‌జీటీల బదిలీలు కూడా ఆగిపోయాయి. మల్టీ జోన్-2(హైదరాబాద్)లో కేవలం ప్రభుత్వ స్కూళల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. వీరిలో 147 మందికి పదోన్నతులు లభించాయి. అలాగే స్థానిక సంస్థల (జెడ్పీ ఉన్నత) పాఠశాలల జీహెచ్‌ఎంల బదిలీలు పూర్తయ్యాయి. మిగిలినవారివి మాత్రం నిలిచిపోయాయి.
హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు
గత మార్చిలో లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్‌ల పోస్టులకు కేవలం లాంగ్వేజ్ పండిట్‌లు అర్హులని, ఎస్‌జీటీలు అర్హులు కారని కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుతో 8,630 మంది లాంగ్వేజ్ పండిట్‌లకు, 1,819 మంది పీఈటీలకు మొత్తం 10,449 మందికి ఎస్‌ఏలుగా ప్రమోషన్లు దక్కాయి. పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయితే మల్టీ జోన్-2లో 778 మందికి గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు.