Ajay Jadeja  Support to Mohammad Amir:  అమెరికా(USA)తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌(Pakistan) సూపర్‌ ఓవర్‌(Super Over)లో పరాజయం పాలైంది. ఓ దశలో సునాయసంగా గెలిచేలా కనిపించిన పాక్‌... చివరి ఓవర్‌లో చతికిలపడింది. చివరి మూడు బంతులకు 12 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచి అమెరికా.. ఓటమికి చేరువ అయినట్లే కనిపించింది. కానీ అరోన్ జోన్స్‌, నీతీశ్‌కుమార్‌ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను టైగా ముగించారు. అనంతరం నిర్వహించిన సూపర్‌ ఓవర్‌లో పాక్‌పై అమెరికా గెలిచింది.

 

ఈ సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. తర్వాత పాక్‌ కేవలం 13 పరుగులకే పరిమితమైంది. అయితే సూపర్‌ ఓవర్‌లో బౌలింగ్ చేసిన మహ్మద్‌ అమీర్‌పై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఓవర్‌లో అమీర్‌ ఎనిమిది ఎక్స్‌ ట్రాలు ఇవ్వడంపై పాక్‌ అభిమానులు మండిపడుతున్నారు. అమీర్‌ బౌలింగ్‌లో తొలి  బంతికి అమెరికా బ్యాటర్‌ జోన్స్ ఫోర్‌ కట్టాడు. అమీర్‌ బౌలింగ్‌లో అమెరికా బౌలర్లు కొట్టిన ఒకే ఒక ఫోర్‌ ఇదే. అయినా అమెరికా 18 పరుగులు చేయగలిగింది. కానీ అమీర్‌ వేసిన వైడ్‌ బంతికి ఎక్స్‌ ట్రాల రూపంలో పరుగులు వచ్చాయి. అనంతరం కూడా అమెరికాకు ఎక్స్‌ ట్రాల రూపంలో ఎనిమిది పరుగులు వచ్చాయి. అమీర్‌ బౌలింగ్‌ వల్లే ఈ పరుగులు వచ్చాయని ఆ దేశ అభిమానులు మండిపడుతున్నారు. అమీర్‌పై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తుండడంతో టీమిండియా ఆల్‌ రౌండర్‌  అజయ్ (Ajay Jadeja) మద్దతుగా నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన అమీర్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. 

 

మద్దతు ఇవ్వండి బ్రో

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్‌ అమీర్‌పై వస్తున్న విమర్శలను టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తిప్పికొట్టాడు. మహ్మద్ అమీర్‌‌కు మద్దతుగా నిలిచాడు.  అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున మహ్మద్ అమీర్ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడని గుర్తు చేశాడు. పవర్‌ప్లేలో కొత్త బంతితో తొలి ఓవర్‌లో  16 పరుగులు ఇచ్చిన అమీర్‌... డెత్‌ ఓవర్లలో అమీర్‌ చివరి రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రిటైర్‌మెంట్‌ ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత గత నెలలో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన అమీర్‌కు కాస్త సమయం ఇవ్వాలని జడేజా అన్నాడు. అప్పుడే అమీర్‌ లోపాలపై ఎక్కువగా విశ్లేషించకూడదని అన్నాడు.

నాలుగు సంవత్సరాల అంతర్జాతీయ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న తర్వాత అశ్విన్‌ జట్టులోకి పునరాగమనం చేసి రాణించిన విషయాన్ని జడేజా గుర్తు చేశాడు. 2020 టీ 20 ప్రపంచకప్‌లో వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరం కావడంతో అప్పటికే నాలుగేళ్లు టీ 20 ప్రపంచకప్‌నకు దూరంగా ఉన్న అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు అమీర్‌ను కూడా అలాగే జట్టులోకి తీసుకున్నారని జడేజా అన్నాడు. తొలి మ్యాచ్‌లోనే అమీర్‌పై విమర్శలు చేయడం తగదని సూచించాడు. 

 

అశ్విన్‌తో చేసినట్లు చేయండి

అమీర్ గురించి మీరు కూర్చుని విశ్లేషించాలనుకుంటే అతను పూర్తిగా టచ్‌లో లేడని విశ్లేషిస్తారు. కానీ అమీర్‌ కోణం నుంచి కూడా ఆలోచించాలి. తాము రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడినట్లుగా అమీర్‌తో కూడా పాక్ కెప్టెన్ మాట్లాడాలి. నాలుగేళ్ల తర్వాత తిరిగి రావడం అంత తేలిక కాదు. అమీర్ కూడా మనిషే. అతడిపైనా ఒత్తిడి ఉంటుందని జడేజా గుర్తు చేశాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్ ఆజమ్‌ కూడా సూపర్ ఓవర్‌ తర్వాత అమీర్‌ను సమర్థించాడు. అమీర్ అనుభవజ్ఞుడైన బౌలర్ అని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. యుఎస్ బ్యాట్స్‌మెన్ తెలివిగా బ్యాటింగ్‌ చేశారని కితాబిచ్చాడు.