Team USA Focus on India now: తమ దేశంలో జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌(T 20 World Cup)లో ఆతిథ్య అమెరికా అదరగొడుతోంది. గ్రూప్‌ ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి భారత్‌(India), పాక్‌(Pakistan)లను దాటి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో కెనడా(Canada)పై గెలిచిన అమెరికా... రెండో మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌(Pakistan)ను మట్టికరిపించింది.

పాకిస్థాన్‌పై గెలుపుతో తమది పసికూన జట్టు కాదని అద్భుతాలు చేసే జట్టని క్రికెట్‌ ప్రపంచానికి అమెరికా టీమ్ చాటి చెప్పింది. అయితే పాక్‌పై గెలిచిన అనంతరం అమెరికా కెప్టెన్‌  మోనాంక్‌ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. భారత్‌తో తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నామని... ఆ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమని మోనాంక్‌ పటేల్‌ అన్నాడు. ఇది భారత్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

మాకూ అవకాశం ఉంది

పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత టీ 20 ప్రపంచకప్‌లో తమకు చాలా అవకాశాల తలుపులు తెరుచుకున్నాయని అమెరికా కెప్టెన్‌ మోనాంక్ పటేల్ తెలిపాడు. భారత్‌తో ఈ నెల 12వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌కు తాము సిద్ధమవుతున్నామని పటేల్‌ వివరించాడు. భారత్‌తో మ్యాచ్‌లో భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని ఏకాగ్రతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మోనాంక్‌ పటేల్‌ తెలిపాడు. పాక్‌పై సాధించిన విజయంతో తమ జట్టు చాలా సంతోషంగా ఉందన్న అమెరికా కెప్టెన్‌... ప్రపంచకప్‌లో మొదటిసారి పాకిస్థాన్‌తో ఆడటం... ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్‌ను ఓడించడం నమ్మశక్యంగా లేదని మోనాంక్‌ పటేల్‌ వెల్లడించాడు. ఇక తమ దృష్టంతా భారత్‌తో జరిగే మ్యాచ్‌పైనే ఉందని తెలిపాడు. తాము పాక్‌పై గెలుపును ఆస్వాదిస్తున్నామని..ఇందులో నుంచి బయటపడి భారత్‌తో జరిగే మ్యాచ్‌కు తాజాగా బరిలోకి దిగుతామని అమెరికా కెప్టెన్‌ తెలిపాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మోనాంక్‌ పటేల్ 50 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 





 

ఈ గెలుపుతొ కొత్త చరిత్ర

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం వల్ల తమకు చాలా అవకాశాలు తెరుచుకోనున్నాయని.. ప్రపంచ కప్‌లోనే పాక్‌పై తమ గెలుపు అతి పెద్ద విజయమని మోనాంక్‌ వెల్లడించాడు. పాక్‌పై తాము సాధించిన గెలుపుతో అమెరికాలో క్రికెట్‌ అభివృద్ధికి ముందడుగు పడుతుందని వివరించాడు. అమెరికా క్రికెట్‌కు ఇదో గొప్ప రోజు అన్న మోనాంక్ పటేల్‌... కెనడా, పాకిస్థాన్‌లపై విజయం సాధించి నాలుగు పాయింట్లతో గ్రూప్-ఎలో అగ్రస్థానంలో ఉన్నా 'సూపర్ 8' అర్హత గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని అగ్రరాజ్య కెప్టెన్‌ తెలిపాడు.  తాము ఇప్పుడు ఐర్లాండ్‌తో మ్యాచ్‌ గురించి కూడా ఆలోచించడం లేదని... ఇక సూపర్ 8(Super 8) గురించి అప్పుడే ఆలోచించబోమని వివరించాడు. ప్రతీ మ్యాచ్‌కు ముందే దాని గురించి వ్యూహ రచన చేస్తామని వివరించాడు. పాక్‌తో గెలుపు తర్వాత సహజంగానే తమ జట్టులోని సభ్యులందరూ సంతోషంగా ఉన్నారని తెలిపాడు.