జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లో జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుందిళ్ల పనులు లేట్ చేస్తున్నారని నవయుగ సంస్థను హెచ్చరించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.  తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శుక్రవారం నాడు మేడిగడ్డ, అన్నారం మ్యారేజ్ లను సందర్శించారు. 
అన్నారం బ్యారేజ్ లో జరుగుతున్న మరమ్మతులకు సంబంధించిన పనులను పరిశీలించారు. గత ఏడాది బీఆర్ఎస్ హయాంలో కుంగిన పిల్లర్ల వర్క్ పురోగతిని ఇరిగేషన్ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నారం సరస్వతి బారేజ్ ను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజ్ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇన్నిరోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ వీలుకాలేదనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక పనుల పురోగతిని పరిశీలించామన్న్నారు. 
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.94 వేల కోట్ల అప్పు
గత ప్రభుత్వం 94 వేల కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టిందన్నారు. కానీ నాణ్యతా లోపం వల్ల.. ఆ అప్పులపై వడ్డీలు కడుతున్నా, ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని అందరికీ తెలుసన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే బ్యారేజ్ లను ఎన్డీఎస్ఏ కు అప్పగించామని చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ మధ్యంతర సూచనలు చేసిందన్నారు. మూడు బ్యారేజ్ ల గేట్లు ఎత్తాలని నిపుణుల కమిటీ చెప్పిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరమ్మత్తులు చేసినా, నీటి నిల్వచేయొద్దని హెచ్చరించినట్లు గుర్తుచేశారు. 


బ్యారేజ్ పరీక్షలు, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే బరిస్తున్నాయని మంత్రి తెలిపారు. మేడి గడ్డ, అన్నారం బ్యారేజ్ లో జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. సుందిల్ల పనులు లేట్ చేస్తున్నారని నవయుగ సంస్థను హెచ్చరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.