SIT On Farm House Case :  ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందని నమోదైన కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిని నియమించారు.  ద‌ర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్య‌ద‌ర్శి బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు.


మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో   టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, కోరె నందకుమార్‌, సింహయాజిలపై కేసులు నమోదు చేశారు.  ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్‌కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ దాఖలు చేశారు. ము గ్గురు నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్‌ వేశారు. ఫోన్ల ట్యాపింగ్‌పై మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు కోరారు. ఇందుకు ప్రతివాదుల తరఫు న్యాయవాది సీహెచ్‌ ప్రభాకర్‌ అభ్యంతరం చెప్తూ గడువు ఎకువ ఇవ్వవద్దని కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది. దర్యాప్తును మాత్రం సిట్ ద్వారా  చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. 


తెలంగాణ అడ్వొకేట్ జనరల్ పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు యత్నించారని ఆయన తెలిపారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లను ఆఫర్ చేశారని అన్నారు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి కూడా తప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిందితులు ప్రలోభపెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై ముందుగానే పూర్తి వివరాలు తెలియడంతో ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. ముగ్గురిని బీజేపీనే రంగంలోకి దింపి, తమ ఎమ్మెల్యేలను వంద కోట్లతో కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్​ఎస్​ ఆరోపిస్తుండగా… ఇదంతా ప్రగతిభవన్​ డైరెక్షన్​లో టీఆర్​ఎస్​ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడింది. ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్ధమని సవాల్​ చేసింది. 


ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో సీఎం కేసీఆర్ ఆడియో.. వీడియోలను బహిరంగంగా విడుదల చేశారు. వాటిని అన్ని మీడియా సంస్థలతో పాటు కోర్టులకూ పంపారు. ఈ అంశాన్ని చిన్న విషయంగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఆడియో.. వీడియో సాక్ష్యాలతోనే పోలీసులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. తుషార్‌ వెల్లపల్లితో పాటు నిందితులకు నోటీసులు జారీ చేసి..విచారణకు పిలిచే అవకాశం ఉంది.