Telangana:  బీఆర్‌ఎస్‌ హయాంలో చత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.  ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.  విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ కొనుగోలు బిడ్‌లో తెలంగాణ డిస్కమ్‌లు పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. రూ.261 కోట్ల బకాయిలు చెల్లించాలని పవర్ గ్రిడ్ ఫిర్యాదు చేసింది. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి.


విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ రోనాల్డ్ రాస్ వాదనల కోసం హైకోర్టుకు వెళ్లారు.   విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్‌ బిడ్డింగ్‌కు అనుమతించాలని ఎన్‌ఎల్‌డీసీని ఆదేశించింది. దీంతో విద్యుత్‌ కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగింది. 


అసలు సంగతేంటంటే ? 
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్‌ను తెచ్చుకునేందుకు గత ప్రభుత్వం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌తో విద్యుత్ సరఫరా కోసం కారిడార్‌ను బుక్ చేసింది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం కారిడార్లను ముందుగానే బుక్ చేసుకుందని, కేవలం 1000మెగా వాట్ల కారిడార్ సరిపోతుండగా..  అవసరం లేకపోయినా మరో 1000 మెగావాట్ల అడ్వాన్స్ కారిడార్లను బుక్ చేసిందని చెబుతున్నారు. అయితే.. ఛత్తీస్‌గఢ్ కు కరెంటు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ కారిడార్‌ను ప్రభుత్వం సగంలోనే రద్దు చేసింది. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం  జరిగిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాడినా వాడకున్నరూ. 261 కోట్లు పరిహారంగా చెల్లించాలని తెలంగాణ డిస్కమ్‌లకు పీజీసీఐఎల్ నోటీసులు జారీ చేసింది.  అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్ ఒప్పందం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ వివాదంపై తెలంగాణ డిస్కమ్‌లు ఇప్పటికే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించాయి. ఈ వివాదం సీఈఆర్‌సీ పరిధిలో ఉండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించనుంది. 


 
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోలు చేయడంతో రాష్ట్రం భారీగా నష్టపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2600 కోట్ల నష్టం వాటిల్లిందని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ విషయమై విచారణ జరిపినప్పుడు అక్కడే ఉన్న విద్యుత్ జేసీ చైర్మన్ రఘు చెప్పిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా చేయలేదని రఘు తెలిపారు. అనంతరం మరో 1000 మెగావాట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని, తప్పు తెలిసి రద్దు చేసుకోవాలంటే కుదరలేదని పేర్కొన్నారు.