Telangana BC reservations:  బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయకపోవడతో స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం సాధ్యం కావడం లేదని తెంలగాణ మంత్రివర్గం భావిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆగస్టు ఐదో తేదీన తెలంగాణ సీఎం సహా మంత్రులందరూ ఢిల్లీకి వెళ్లి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.  

తెలంగాణ శాసనసభలో ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, మరియు ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పించే లక్ష్యంతో ఉన్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్రం  ఆలస్యాన్ని నిరసిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 5, 2025న మంత్రులతో కలిసి ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని కేబినెట్ నిర్ణయించామన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,   కేంద్ర మంత్రులను కలిసి బిల్లులకు ఆమోదం కోరనున్నారు.  ఇండియా కూటమి నాయకుల నుండి మద్దతు కూడా కోరతారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను  సెప్టెంబర్ 2025 చివరి నాటి  నిర్వహించాలని, రిజర్వేషన్  ను  ఈ నెలాఖరు నాటికి ఖరారు చేయాలని ఆదేశించింది. అయితే, బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల, రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రిజర్వేషన్ ఖరారుపై హైకోర్టు గడువు  సమీపించిన సమయంలో ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించడానికి ఢిల్లీలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బిల్లు చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నా.. ఎందుకు ఆమోదింపచేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ  నేతల్ని ప్రశ్నించారు. ధర్నాలు చేయడానికి తమతో కలిసి రావాలన్నారు. ధర్నాల కోసం మిత్రపక్షాలన్నింటితో కలిసి వెళ్తామన్నారు. బీజేపీ నేతలు..బీసీ రిజర్వేషన్లతో రాజకీయాలు చేయవద్దన్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్,   రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలలోని బీసీ నాయకులను 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం సహకరించాలని పొన్నం కోరారు.  తెలంగాణ ఉద్యమం తరహాలో జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కుల (SEEEPC) సర్వే ఆధారంగా కులగణన న్యాయపరమైన చిక్కులు లేకుండా జరిగిందని, ఈ సర్వే ప్రకారం బీసీలు ..ముస్లిం బీసీలు మినహా.. 46.2 శాతం జనాభాను కలిగి ఉన్నారన్నారు. ఇండియా కూటమి నాయకుల నుండి కూడా ఈ అంశంలో మద్దతు కోరనున్నట్లు ఆయన తెలిపారు.    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ   జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం నినాదానికి అనుగుణంగా ఉందని ఉందన్నారు.   రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఢిల్లీ ధర్నా చేయాలనుకోవడంతో .. రాజకీయం మరింత  వేడెక్కనుంది.