Savitri Bhai Phule Jayanti As Women Teachers Day In Telangana: బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule) జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల సేవలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని కొనియాడారు.
మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని ఆర్పించారని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సావిత్రీబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళల సాధికారతకు పెద్దపీట వేయటంతో పాటు, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించే నైపుణ్యాల వృద్దికి వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి పాటుపడే భవిష్యత్తు ఆలోచనలతో రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను తమ ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసిందని అన్నారు.
సీఎంకు మంత్రి పొన్నం ధన్యవాదాలు
సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. దేశ తొలి ఉపాధ్యాయురాలిగా మహిళలు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగని చాటిన ధీశాలి సావిత్రిభాయి ఫూలే అని కొనియాడారు. ఫూలే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడి దేశంలో మొదటి మహిళా పాఠాలకు పునాదులు వేశారన్నారు. అత్యంత గౌరవనీయమైన మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరైన సావిత్రీబాయి విద్య ద్వారా స్త్రీలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారన్నారు. ఆ మహనీయురాలి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.