AP Deputy CM Pawan Kalyan Speech In Vijayawada Book Fair: తాను ఎవరికైనా రూ.కోటి ఇచ్చేందుకు వెనుకాడనని.. కానీ తన వద్ద ఉన్న పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (VBFS) ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని (Book Fair) ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తనకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది. పుస్తకాలేనని అన్నారు. 'నా తల్లిదండ్రుల వల్ల నాకు పుస్తక పఠనం అలవాటైంది. నా వద్ద ఉన్న ఓ మంచి పుస్తకం ఇవ్వాలంటే నా సంపద ఇచ్చినంత మథనపడతా. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా.. కానీ నా వద్ద ఉన్న పుస్తకాలు మాత్రం ఇవ్వను. పుస్తక పఠనం లేకుంటే నేను జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుంది. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు.' అని పవన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ప్రముఖ పత్రికా ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకూ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ బుక్ ఫెయిర్ జరుగుతుందని వీబీఎఫ్ఎస్ కార్యదర్శి మనోహర్‌నాయుడు తెలిపారు. ఈ ఏడాది 270 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు రతన్‌టాటా పేర్లు పెట్టినట్లు వీబీఎఫ్ఎస్ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య వెల్లడించారు.
మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభం
అనంతరం కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్‌ను పవన్ కల్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ.2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుంది. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి.
ఈ వాహనంలో 7 రకాల పరికరాలు అమర్చారు. వారంలో మూడు రోజులపాటు ఒక మండల పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ అల్ట్రా సౌండ్, మొమోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్ రే, కెమికల్ అనాలసిస్, కొలస్కోపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40 వేల మరణాలు అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ ప్రతినిధులను, చొరవ చూపిన ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరిని పవన్ అభినందించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.