Telangana new Brand beers :  తెలంగాణలో కొద్ది రోజులుగా కొత్త  బీర్ బ్రాండ్లు హైలెట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా విచిత్రమైన బ్రాండ్లు మద్యం దుకాణాల్లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ల కొరత ఏర్పడింది. దీంతో ఏపీలో మాదిరిగా మద్యం గూడుపుఠాణి ఏదో జరుగుతోందన్న అనుమానాలు, ఆరోపణలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా ఇది ఇబ్బందికరం అయ్యే అవకాశాలు కనిపించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమయింది. 


కొత్త బ్రాండ్లకు ఇచ్చిన లైసెన్స్‌లు తాత్కలికంగా నిలిపివేత                                     


తెలంగాణ  ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం  తీసుకుంది.  మందుబాబుల  వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వస్తున్న ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నందన  కొన్ని రోజులు ఈ బ్రాండ్‌లను అమ్మవద్దని నిర్ణయించారు.  సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. 


ఏపీ తరహాలో ఉన్న బ్రాండ్లపై మందు బాబుల్లో వ్యతిరేకత                                


తెలంగాణలో దర్శనమిస్తుున్న   కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఈ ఐదు కంపెనీలు తెలంగాణలో దాదాపు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. లైసెన్సు పొందిన కొన్ని కంపెనీలకు సరైన  ట్రాక్ రికార్డు  లేకపోవడం, కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు కథనాలు రావడంతో ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.                             


ఏపీ సర్కార్‌కు ఘోరమైన ఫలితాలకు కారణం నాసిరకం మధ్యం కూడా !                     


ఏపీలో అక్కడి ప్రభుత్వానికి మద్యం విధానం పెద్ద మైనస్ గా మారింది. ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. నాసిరకం మద్యం అత్యధిక రేట్లకు విక్రయించారని.. పేదల ఆదాయాన్ని పిండుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల్లో .. వైసీపీకి ఘోరమైన రిజల్ట్ రావడానికి మద్యం బ్రాండ్లు కూడా  ఓ కారణమని ప్రజలు నమ్మారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తెలంగాణ సర్కార్.. బ్రాండ్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.