Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేస్తుంటే... సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. సభకు వచ్చిన వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రి పవన్ కల్యాణ్‌ తన అన్న చిరంజీవి కాళ్లకు దణ్ణం పెట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  


పవన్ కల్యాణ్‌ మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సభలో అడుగుపెట్టీ పెట్టగానే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌... ముందు ప్రజారాజ్యం బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో 2014లో జనసేన పేరుతో పార్టీ పెట్టి ప్రజా సేవ చేస్తున్నారు. 2014 ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన పవన్ 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి కూటమితో కలిపి పోటీ చేశారు. పవన్ కల్యాణ్‌ గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మాత్రం ఒక్కచోట పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.


 


పవన్ కల్యాణ్ తర్వాత నారా లోకేష్ ప్రమాణం చేశారు. లోకేష్ ఇప్పటికే ఒకసారి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 2014లో నవ్యాంధ్రలో కొలవుదీరిన తొలి ప్రభుత్వంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూసుకున్నారు . అప్పుడు ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి విధులు నిర్వహించారు. ఈసారీ మాత్రం మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణం చేశారు.