తెలంగాణ ప్రభుత్వం  కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్‌ సేప్టీ సెస్‌ను విధించాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే ప్రతి వాహనంపైనా ఈ సెస్‌ను వసూలు చేయనుంది. మోటారు సైకిల్‌, స్కూటర్‌, మోపెడ్‌ వంటి  వాటికి రూ.500, కార్లకు రూ.2000, వాణిజ్య రంగ వాహనాలకు రూ.2500 దాకా రోడ్‌సేఫ్టీ సెస్‌ కింద వసూలు చేయనున్నారు. అంటే ప్రతీ వాహనంపైనా రూ. 500 నుంచి రూ. 2500 వరకు పెరిగినట్లయింది. అయితే ఇదే తొలి పెంపు కాదు. వారం రోజుల కిందట వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌, గ్రీన్‌ ట్యాక్స్‌, త్రైమాసిక ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది. 


అన్ని రకాల  వాహనాలపై విధించే జీవితకాల పన్నును  వారం క్రితం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా కొనే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్‌ ట్యాక్స్‌ ఆ వాహనం ధరపై ఇప్పటి వరకు 9 శాతం ఉంది. ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయించారు. నిజానికి ఇప్పుడు రూ. యాభై వేలకు వచ్చే టూవీలర్ ఏదీ లేదు. టీవీఎస్ ఎక్స్ ఎల్ మోపెడ్ మాత్రమే వస్తుంది. అంటే ఆ వాహనానికి మాత్రమే తొమ్మిది శాతం పన్ను. మిగతా అన్ని వాహనాలకు పన్నెండు శాతం పన్ను వసూలు చేస్తారు. ఒక్కో వాహనంపై కొత్తగా కొనేవారికి రూ.3 వేలు అదనపు భారం పడనుంది. ఇది కొత్తగా బైక్‌లు కొనేవారికి అదనపు భారంగా మారనుంది. 


కొత్త ట్యాక్స్‌‌ల ప్రకారం బండిని బట్టి రూ.3 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా అదనంగా కట్టాల్సి ఉంటుంది. నాన్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో త్రీవీలర్‌‌, ఫోర్‌‌ వీలర్ వాహనాల లైఫ్‌‌ ట్యాక్స్‌‌ ఇప్పటి దాకా రెండు స్లాబులుగా ఉండగా, దాన్ని నాలుగు స్లాబులుగా మార్చింది. కార్లు, జీపులు, ఆటోలు, 10 సీట్ల ఓమ్నీ బస్‌ వంటివి‌ వస్తాయి. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖరీదైన వాహనాలకు 12 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదైన వాహనాలకు 14 శాతం లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వేస్తున్నారు. ఇక నుంచి రూ.5 లక్షల లోపు వాహనాలకు 13 శాతం, రూ.5 నుంచి 10 లక్షల మధ్య వెహికల్స్‌కు 14 శాతం, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షల ధర కంటే ఎక్కువగా ఉండే వాటిపై 18 శాతంగా నిర్ణయించారు. అంటే ఒక్కో వాహనంపై సుమారు రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు అదనంగా లైఫ్‌‌ ట్యాక్స్‌‌ భారం   పడుతుంది. 


పాత వాహనాలను క్రమంగా తప్పించి నూతన సాంకేతికత, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో రవాణా శాఖ పాత వాహనాలను స్క్రాప్‌ కింద పరిగణించేందుకు గ్రీన్‌ ట్యాక్స్‌ను భారీగా పెంచారు.  మోటారు సైకిల్‌, కారు వంటి వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల తర్వాత రీ-రిజిస్ట్రేషన్‌ సందర్భంలో రూ.2000, రూ.5000 చొప్పున గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. కొత్త బండి కొన్నా.. పాత వాహనం కొన్నా పన్నులు మాత్రం పెరిగాయన్నమాట.