Covid Booster Dose In Telangana : తెలంగాణలో రేపటి(జులై 15) నుంచి ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడి అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చింది. కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
75 రోజుల పాటు వ్యాక్సినేషన్
రాష్ట్రంలో 75 రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోందని తెలిపారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు రోగ నిరోధకశక్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు 20 లక్షల డోసుల నిల్వ ఉన్నాయని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ వ్యాక్సిన్లు వేస్తారని తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాజీపేట రైల్వేస్టేషన్లతో పాటు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో 24 గంటలపాటు బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కేంద్రం కీలక నిర్ణయం
కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా బూస్టర్ డోసులు అందించనున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 75 రోజుల పాటు ఉచితంగా అందించనున్నారు. 18-59 ఏళ్ల మధ్య వయసున్న వారికి టీకాలు అందిస్తామని తెలిపింది. అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లోనూ టీకాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బూస్టర్ డోస్‌లు తీసుకునే వారి సంఖ్యను పెంచాలన్నదే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలో 18-59 ఏళ్ల మధ్య ఉన్న వారి జనాభా 77 కోట్లుగా ఉంది. వీరిలో 1% మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లకు పైబడిన 16 కోట్ల మంది జనాభాలో 26%, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కూడా బూస్టర్ డోస్ తీసుకోని జాబితాలో ఉన్నారు.