KCR Comments in Telangana Formation Day: దేశం చుక్కాని లేని నావ లాగా గాలివాటుకు కొట్టుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా మన దేశంలో ఇంకా దారిద్ర్యం ఇందుకు ఉందని ప్రశ్నించారు. మన దేశంలో సుసంపన్నమైన వనరులు ఉన్నాయని, కష్టం చేసే ప్రజలు ఉన్నారని అన్నారు. దీనికి వైఫల్యం ఎవరు బాధ్యత వహించాలని అన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ వేడుకలు జరిగాయి.


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నది. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్యబాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.


ఉన్న పెట్టుబడులు వెనక్కిపోతాయి
మనతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్ లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నం. ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. 


వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. 


నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. భారత దేశంలో ప్రజలకు కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి.


కంటికి రెప్పలా కాపాడుకుంటా
ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదు. రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళమా? మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళమా? సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత దేశ  నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి. దేశంలో గుణాత్మక పరివర్తనను  సాధించే శక్తియుక్తులను ఆ భగవంతుడు మనందరికీ  ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ అని కేసీఆర్ అన్నారు.