Telangana Formation Day 2024 Live: ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు - సీఎం రేవంత్, గవర్నర్ హాజరు

Telangana Formation Day 2024 Live Updates: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికి 10 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

Venkatesh Kandepu Last Updated: 02 Jun 2024 09:12 PM
వానను సైతం లెక్క చేయకుండా భారీగా వీక్షకులు

ఓ వైపు హైదరాబాద్ లో వాన పడుతున్నా వేడుకలను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.  ప్రేక్షకుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. కళాకారులు తెలంగాణ కళారూపాలను  ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్  జనాలకు ఆకట్టుకుంటున్నాయి. వానలో తడుస్తూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.


8:50 నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై క్రాకర్స్ షో ప్రదర్శించారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు.  వేడుకలకు వస్తున్న వారికోసం 80కి పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడే లేజర్ షోను సైతం అద్భుతంగా నిర్వహించారు.

Telangana Formation Day Celebrations: ట్యాంక్ బండ్ పై అంబరాన్నంటిన సంబరాలు

తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం (జూన్ 2న) రాత్రి  ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సమయంలో  ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను వారు పరిశీలించారు.


రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి  కళాకారులు తరలివచ్చారు. వారు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు. నేడు ఆవిష్కరించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్‌ వాక్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు  భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిక్కిరిపోయాయి. వేడుకలు జరుగుతున్న తరుణంలో వాన పడడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.

ట్యాంక్ బండ్ పై తెలంగాణ దశాబ్ది వేడుకలు - సీఎం రేవంత్, గవర్నర్ హాజరు

తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్‌పై 'పదేళ్ల పండుగ' పేరుతో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి చాటిచెప్పేలా వివిధ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఈ క్రమంలో ట్యాంక్ బండ్‌పై ప్రజలు భారీగా చేరుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవం - సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్

పదేళ్ల తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవం.. రాష్ట్ర పునరుజ్జీవ సందర్భానికి నాంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను ట్విట్టర్ వేదికంగా పంచుకున్నారు. 'ఈ దశాబ్ది ఉత్సవం… దశాబ్ద కాలం తర్వాత… తెలంగాణ పునరుజ్జీవన సందర్భం అమరుల ఆశయ సాధనలో… ప్రజల ఆకాంక్షల సాధనలో… స్వేచ్ఛలో… సామాజిక న్యాయంలో… సమాన అవకాశాల్లో … పునరుజ్జీవన ప్రస్థానానికి ఈ వేడుక నాంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.





'సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారెంటీలు అమలు చేస్తాం' - కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వీడియో సందేశం

సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. గత పదేళ్లుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల అత్యంత ప్రేమాభిమానాలు చూపారు.





తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణ సహకారం మరువలేనిదని.. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.





ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వం - సీఎం రేవంత్ రెడ్డి

ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. ఇక్కడి ప్రజలు భానిసత్వాన్ని భరించరని అన్నారు. 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం' అని పేర్కొన్నారు.

Jaya Jaya He Telangana Song: జయజయహే తెలంగాణ గీతం పాడింది వీరే..

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ (Jaya Jaya He Telangana) ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు.


పూర్తి కథనం చదవండి: చరిత్రలో నిలిచిపోయేలా ‘జయ జయహే తెలంగాణ’ గీతం, పాడింది వీరే!

తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' విడుదల - రచయిత అందెశ్రీ భావోద్వేగం

తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.

Jaya Jayahe Telangana song Release: జయజయహే తెలంగాణ రాష్ట్రీయ గీతం విడుదల

Revanth Reddy Releases Jaya Jayahe Telangana song: పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 

Telangana Formation Day Celebrations: కాసేపట్లో జయజయహే తెలంగాణ గీతం విడుదల

Telangana Latest News: పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నూతనంగా రూపొందించిన తెలంగాణ రాష్ట్రీయ గీతం అయిన జయజయహే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు.

Revanth Reddy: పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy in parade Grounds: సికింద్రాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకున్న రేవంత్ రెడ్డి తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు - పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

KTR on Telangana Formation Day: రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి - కేటీఆర్

KTR on Revanth Reddy: తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. పండుగ వాతావరణం లో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి. సీఎం కు అవగాహన,పరిపక్వత లేదు. ఛత్తీస్ ఘడ్ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రి. కానీ పది సంవత్సరాల తెలంగాణ ను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం. తెలంగాణ ఏర్పాటు వెనక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి  రేవంత్ రెడ్డి కి లేదు. రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రి. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన మెసేజ్ లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసిఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కేటీఆర్ మాట్లాడారు.





Telangana Bhavan: తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.





Telangana Formation Day Celebrations in Raj Bhavan, High Court: రాజ్ భవన్, తెలంగాణ హైకోర్టులోనూ రాష్ట్ర అవతరణ వేడుకలు

అంతకుముందు తెలంగాణ రాజ్ భవన్ లోనూ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరిగాయి. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు.





Revanth Reddy News: అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు

Telangana Formation Day News: తెలంగాణ అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు.

Telangana Formation Day: గాంధీ భవన్‌లో రాష్ట్ర దశాబ్ది వేడుకలు

Telangana Formation Day in Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నేత మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 





Revanth Reddy: అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్

Telangana Formation Day 2024 live: తెలంగాణ పదో అవతరణ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు.

Background

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన వేళ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం (జూన్ 2) ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారు.


తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఐపీఎస్ అధికారులకు, హోం గార్డులకు మెడల్స్ కూడా అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ టాప్ లీడర్ సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఆమె హాజరు కావడం లేదు. అనారోగ్య కారణాల కారణాల వల్ల ఆమె ఓ వీడియోను మాత్రమే విడుదల చేశారు. ఆ వీడియోలో తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. 


ఉదయం 9.35లకు పరేడ్ గ్రౌండ్‌కు సీఎం రేవంత్ రెడ్డి
9.55కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ స్వాగతం
10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ
అనంతరం పోలీసుల గౌరవ వందనం, మార్చ్ పాస్ట్
10.30కు తెలంగాణ రాష్ట్రీయ గేయం ఆవిష్కరణ
10.43 కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
11.08కు పోలీస్ సిబ్బందికి అవార్డుల ప్రదాన కార్యక్రమం


తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టారు. ముందు రోజు సాయంత్రం నుంచే పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.