TS Formation Day Celebrations: రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతోంది. రాష్ట్ర అవతరణ వేడుకల (Telangana Formation Day Celebrations) నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (Telangana Chief Secretary) శాంతి కుమారి (Santhi Kumari) వివిధ శాఖల అధికారులతో సమీక్ష (Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలపై చర్చించారు. జూన్ 2 ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ వెల్లడించారు.
పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లపై సమీక్ష
పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
సర్వాంగ సుందరంగా భాగ్యనగరం
నగరంలోని రోడ్డుకు ఇరువైపులా రంగు రంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎస్ శాంతా కుమారి ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర అవతరణ వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు.
ట్యాంక్ బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు
అలాగే ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన ఎంటర్‌టైన్మెంట్ ఏర్పాట్లు చేస్తామన్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ కళలతో కూడిన కార్నివాల్ జరుగుతుందని చెప్పారు. 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని సీఎస్ వివరించారు. ట్యాంక్ బండ్‌పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశ ఉందని, వారికి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జూన్ 2న ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బాణసంచా ప్రదర్శనతో పాటు లేజర్ షో ఏర్పాటు చేసినట్లు సీఎస్ చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవీ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నగర పోలీస్ అడిషనల్ కమిషనర్ పాల్గొన్నారు.
ఈసీ అనుమతి
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ అనుమతి లభించిన తరువాత రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి వరుసగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.