Revanthreddy Slams BRS: తెలంగాణలో పేదలు బతికే పరిస్థితే లేదని, సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ (Jawaharnagar) లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు మేడ్చల్ కు తెస్తామన్న ఐటీ పార్కు (Medchal IT Park) ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. జవహర్ నగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చింది డంపింగ్ యార్డేనని ఎద్దేవా చేశారు. డంపింగ్ యార్డు విషయంలో కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా తరలించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలను ఆదుకుంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.' అని వెల్లడించారు. 


కేసీఆర్, మల్లారెడ్డిపై విమర్శలు


సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో తోడు దొంగల్లా భూకబ్జాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి, వారికి నీడ లేకుండా చేశారని మండిపడ్డారు. చెరువుల పక్కన భూములు కొని వాటిని మింగిన ఘనుడు మల్లారెడ్డి అని, అధికారులు అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికే కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చారని, మరి కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్నారో అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని, ప్రజాధనం వృథా అయ్యిందని దుయ్యబట్టారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి ఆగం చేసిన కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకూ తరమాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


ఐటీ పార్కు ఏమైంది.?


మేడ్చల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ను గద్దె దింపే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. హస్తం గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


హామీల జల్లు


ఈ సందర్భంగా  రేవంత్ రెడ్డి ప్రజలకు హామీల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రైతులందరికీ ఉచిత విద్యుత్, ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికీ రైతు బంధు కింద రూ.12 వేలు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష నగదు, తులం బంగారం అందిస్తామన్నారు. 


Also Read: Telangana Election Contestant List 2023: ఎన్నికల బరిలో నిలిచింది వీరే - ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన ఈసీ