Karnataka Hijab Ban:
హిజాబ్‌పై నిషేధం లేదు..
కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హిజాబ్‌లపై నిషేధం (Ban on Hijab) ఉండదు అని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో హిజాబ్‌ని నిషేధించే ఆలోచనే ఏమీ లేదని తేల్చి చెప్పింది. కర్ణాటక విద్యాశాఖ హిజాబ్‌పై నిషేధం విధించిందన్న వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వమే అధికారికంగా ఈ ప్రకటన చేసింది. అలాంటి నిషేధం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. కొత్త నిబంధనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, మాల్‌ప్రాక్టీసింగ్‌ని కట్టడి చేయడం తప్ప మరే విధమైన ఆంక్షలు విధించాలన్న ఆలోచన లేదని తెలిపింది. కొత్త ఎగ్జామ్ రూల్స్ అంటూ ఏమీ లేవని, పాత నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
"హిజాబ్ సహా మరే సంప్రదాయ దుస్తుల్లో వచ్చినా సరే వాళ్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. గత పరీక్షల్లో ఎలాంటి నిబంధనలైతే ఉన్నాయో అవే ఇప్పుడూ కొనసాగుతాయి. కొత్త రూల్స్ ఏమీ లేవు. మాల్‌ప్రాక్టీస్‌ని కట్టడి చేసేందుకు అవసరమైన ఆంక్షలు మాత్రమే విధిస్తాం. హిజాబ్ ధరించిన వాళ్లను గత పరీక్షల్లో అనుమతించాం. ఈసారి కూడా ఇదే కొనసాగుతుంది"
- విద్యాశాఖ అధికారులు
కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (Karnataka Examination Authority) ఇటీవలే ఓ సర్క్యులర్ జారీ చేసింది. స్కార్ఫ్‌లు, టోపీలు, హెడ్ డ్రెస్‌లు..ఇలాంటివేవి ధరించి వచ్చినా పరీక్ష హాల్‌లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. నవంబర్ 18,19వ తేదీల్లో గవర్నమెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఈ రూల్ (Karnataka Hijab Ban Issue) తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే..ఎక్కడా హిజాబ్ ప్రస్తావన తీసుకురాకపోయినా ఈ సర్క్యులర్ వివాదాస్పదమైంది. అసదుద్దీన్ ఒవైసీ సహా ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్‌పై మండి పడ్డారు. హిజాబ్‌పై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే..అటు కర్ణాటక విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ విమర్శలపై అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించారు.
సుప్రీంకోర్టుకి వివాదం..
కర్ణాటక హిజాబ్ వివాదంపై ఇటీవలే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం. ముగ్గురు జడ్జ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆ ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పర్దివాలా ధర్మాసనం ఈ విషయం తెలిపింది. ఓ మహిళా న్యాయవాది ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మార్చి 15వ తేదీన కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ను అనుమతించాలని వేసిన పిటిషన్‌లన్నింటినీ కొట్టి పారేసింది. తరగతి గదులు మతపరమైన విధానాలు పాటించేందుకు వేదిక కావని తేల్చి చెప్పింది. ఆ తరవాతే ఈ వివాదం సుప్రీం కోర్టు గడప తొక్కింది. కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది.
Also Read: PMGKAY News: ఏడాది పాటు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు, కేంద్రం కీలక ప్రకటన