India vs New zealand semi final: ముంబైలోని వాంఖడే(Wankhede)  వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌(india vs new zealand )మధ్య జరిగిన సెమీఫైనల్లో ఆసక్తికర ఘటన జరిగింది. కివీస్‌ ఇన్నింగ్స్ 43 ఓవర్లో జరిగిన ఓ ఘటన క్రికెట్ అభిమానులను గందరగోళంలో పడేసింది. కివీస్‌ ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో బుమ్రా వికెట్లను గిరాటేసినా అంపైర్ ఔట్ ఇవ్వకపోవటం ఆశ్చర్యపరిచింది. జస్ప్రీత్ బుమ్రా విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. అప్పటికీ ఫిలిప్స్ ఇంకా క్రీజులోకి చేరుకోలేదు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో అంపైర్‌ అవుట్ ఎందుకు ఇవ్వలేదా అని చాలా మంది అభిమానులు గందరగోళంలో పడ్డారు.  దీని వెనుక అసలు కారణం వేరే ఉంది.


 బుమ్రా వేసిన 43వ ఓవర్ తొలి బంతికి మిచెల్ రెండు పరుగులు తీశాడు. అయితే బంతిని ఆపిన రవీంద్ర జడేజానాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లకు డైరెక్ట్‌గా షూట్‌ చేశాడు. వికెట్లను తాకిన బంతి పక్కకు దూసుకెళ్లింది. అప్పటికే తొలి పరుగు పూర్తిచేసిన మిచెల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బుమ్రా బౌలర్ వైపున ఉన్న వికెట్లకు నేరుగా త్రో చేశాడు. . అప్పటికి కివీస్ బ్యాటర్ ఫిలిప్స్ క్రీజులోకి చేరుకోలేదు. కానీ అంపైర్ అతన్ని నాటౌట్‌గా ప్రకటించారు.


మెన్‌ క్రికెట్‌ కమిటీ(MCC) రూల్స్ ప్రకారం వికెట్ల మీద ఉన్న రెండు బెయిల్స్ కిందపడిన సమయంలో ఫీల్డర్ రనౌట్ చేయాలని అనుకుంటే బంతిని చేత్తో పట్టుకుని వికెట్లను లాగేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్, ఇండియా మ్యాచ్‌లో బుమ్రా రనౌట్ చేసినప్పటికే వికెట్ మీద ఉన్న బెయిల్స్ లేకపోవడంతో దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. జడేజా విసిరినప్పుడే బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో బుమ్రా మరోసారి వికెట్లను పడగొట్టినా ఫలితం లేకపోయింది. అందుకే అంపైర్ గ్లెన్ ఫిలిప్స్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. ఒకవేళ బుమ్రా బంతిని చేత్తో పట్టుకుని వికెట్‌ను లాగేసి ఉంటే ఫిలిప్స్‌ను రనౌట్ అయ్యేవాడు. 


ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌  రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. కళ్లముందు భారీ లక్ష్యం కనపడుతున్నా న్యూజిలాండ్ గొప్పగా పోరాడింది. అయినా భారత బౌలర్ల ముందు ఆ పోరాటం సరిపోలేదు. విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ షమీ మరోసారి జూలు విదిల్చడంతో కివీస్‌ 48.5 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు.


 కోహ్లీ, అయ్యర్‌ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ అద్భుత బౌండరీలతో ఆకట్టుకోగా.. అయ్యర్‌ భారీ షాట్లతో అలరించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే  శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో అయ్యర్‌ శతకం బాదేశాడు. అనంతరం స్కోరును పెంచే క్రమంలో 70 బంతుల్లో 105 పరుగులు చేసి అయ్యర్‌ వెనుదిరిగాడు. చివర్లో రాహుల్‌ కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.