తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు అంశం ఓ కొలిక్కి వచ్చింది. జనసేనకు 9 స్థానాలు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూకట్పల్లి, వైరా, నాగర్ కర్నూలులో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇంకా 3 స్థానాలపై స్పష్టత రాలేదు. తొలుత జనసేన 11 చోట్ల పోటీ చేయాలని భావించినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జనసేనాని పవన్ కల్యాణ్ చర్చల అనంతరం 9 స్థానాలకు ఆ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పని చేయాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన తొలుత ప్రకటించింది. ఆ తర్వాత కీలక పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పవన్ ఇంటికి వెళ్లి ఇటీవల చర్చలు జరిపారు. అనంతరం అమిత్ షాను జనసేనాని చర్చించారు. ఈ క్రమంలో జనసేనకు 9 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించడంతో పవన్ ఓకే చెప్పారు.
88 చోట్ల బీజేపీ అభ్యర్థుల ఖరారు
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే 3 జాబితాల్లో 119 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 31 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను ప్రకటించాల్సి ఉండగా, జనసేనతో పొత్తు ఖరారైంది. ఈ క్రమంలో జనసేన 9 స్థానాల్లో బరిలో నిలవగా, మిగిలిన 22 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. సోమవారం ఢిల్లీలో జరగనున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొలిక్కి రానుంది. అనంతరం బీజేపీ 22 మంది అభ్యర్థులతో 4వ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రధాని సభకు పవన్ హాజరు
ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లు కోరగా ఆయన అంగీకరించారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన, గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని, రాబోయే ఎన్నిక్లలో తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని తెలిపారు.
'ఒప్పందానికి వచ్చాం'
తెలంగాణలో ఒకటీ రెండు సీట్లు తప్ప మిగిలిన వాటిపై ఒప్పందానికి వచ్చామని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఇటీవల సమావేశంలోనూ ప్రధానిగా మోదీ ఉండాల్సిన ఆవశ్యకతను చర్చించామని, ఇందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని పేర్కొన్నారు.