Congress Complaint to CEO against BRS Government: తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్ (Congress) నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ (Viikasraj) ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanthreddy), ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు సీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 4 అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న జరగబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు తెలుస్తోంది. అలాగే, నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సీఈవోను కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 


4 అంశాలపై ఫిర్యాదు


బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని, ఆ పార్టీకి సంబంధిచిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. 'రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. సుమారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన వారికి ఇచ్చేందుకు సర్కారు యత్నిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్ లోకి మార్చేస్తున్నారు. అసైన్డ్ భూములు ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయకుండా చూడాలి. ఆ భూముల రికార్డులు మారకుండా చూడాలి.' అని ఈసీని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని, 4 అంశాలపై వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.


కేబీనెట్ భేటీపై


ఎన్నికల ఫలితాల వేళ సోమవారం కేబినెట్ భేటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. 'ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆదివారం గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరాం.' అని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదివారం కేబినెట్ భేటీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని, రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.


Also Read: Nagarjuna Sagar Dispute: సాగర్ వివాదంపై కీలక సమావేశం - ఏం నిర్ణయించారంటే.?