CM KCR Comments in Adilabad Praja Ashirwada Sabha: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఆదిలాబాద్ (Adilabad)_ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓ పాలసీ ప్రకారం పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి కచ్చితమైన విధానాలతో అన్ని రంగాల్లో విజయం సాధించామన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, ప్రస్తుతం భారతదేశంలో ఆ పరిణతి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లను నమ్మితే నట్టేట మునిగినట్టేనని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, అభ్యర్థి చరిత్ర, ఆ పార్టీ చేసిన అభివృద్ధి అన్నీ చూసి పరిణతితో ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


అన్ని రంగాల్లోనూ వృద్ధి


తెలంగాణ నేడు అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, రైతులు బాగుండాలని నీటి పన్ను రద్దు చేశామన్నారు. 'ఉచిత కరెంట్, రైతుబంధు, రైతులు పండించిన పంటను నష్టం వచ్చినా సరే ప్రభుత్వమే కొనడం. రైతు చనిపోతే వారంలోపే బీమా వచ్చేలా చేస్తున్నాం. వందల రూపాయలు ఉన్న పింఛన్ ను వేల రూపాయలకు పెంచాం. మూడేళ్లు ఆలోచించి ధరణి తెచ్చాం. దళారుల రాజ్యం లేకుండా చేశాం.' అని కేసీఆర్ వివరించారు. 


'నా బాధ అదే'


'ఈ తెలంగాణ నాశనం కావొద్దనేదే నా బాధ. మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణి తీసేస్తాం అంటున్నారు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.' అని కేసీఆర్ పేర్కొన్నారు. 'మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు.' కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని ఎద్దేవా చేశారు. ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు అని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలగానే ఎంతో మంది వచ్చి ఏవేవో మాట్లాడుతారని, వాటిని నమ్మొద్దని సూచించారు. చైతన్యం ఎక్కువగా ఉండే ప్రాంతం ఆదిలాబాద్ అని, నియోజకవర్గం బాగు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటెయ్యాలని అన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని, కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అంటూ.? కేసీఆర్ ప్రశ్నించారు. నిజానిజాలు గమనించి ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


'బీజేపీకి బుద్ధి చెప్పాలి' 


రాష్ట్రంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారని, మతపిచ్చి లేపే బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, చెత్తకుప్పలో పారేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీ ఓటెందుకెయ్యాలని నిలదీశారు. గతంలో మంచినీళ్ల కోసం ఎంతో బాధ పడ్డామని, అందుకే ఆలోచించి మిషన్ భగీరథ తెచ్చామని చెప్పారు. 'బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేస్తాం. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం. ఇక్కడ కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నందున కోల్డ్ స్టోరేజీ మంజూరు చేస్తాం. గిరిజనులకు ఇప్పటికే పోడూ భూముల పట్టాలిచ్చాం. గిరిజనేతరులకు కూడా వచ్చే దఫాలో పట్టాలిస్తాం. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.' అని కేసీఆర్ అన్నారు.


Also Read: Revanthreddy Slams CM KCR: 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ' - మేడ్చల్ ఐటీ పార్కు ఏమైందని సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం