Bjp Fourth List: తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాను మంగళవారం విడుదల చేసింది. 12 మందితో ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటివరకూ మొత్తం 100 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పెండింగ్ లో 19 స్థానాలున్నాాయి. జనసేన అడుగుతున్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు నిరాశ ఎదురైంది. ఆయన తనయుడు వికాస్ రావు వేములవాడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. వేములవాడలో తుల ఉమకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఇక మునుగోడు నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ దక్కించుకున్నారు.


అభ్యర్థులు వీరే



  • సిద్ధిపేట - దూది శ్రీకాంత్ రెడ్డి

  • నకిరేకల్ - నకరకంటి మొగులయ్య 

  • వేములవాడ - తుల ఉమ

  • కొడంగల్ - బంటు రమేష్ కుమార్

  • చెన్నూరు - దుర్గం అశోక్

  • ఎల్లారెడ్డి - వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

  • గద్వాల - బోయ శివ

  • మిర్యాలగూడ - సాదినేని శ్రీనివాస్

  • ములుగు - అజ్మీరా ప్రహ్లాద్ నాయక్

  • హుస్నాబాద్ - బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి

  • మునుగోడు - చలమల్ల కృష్ణారెడ్డి

  • వికారాబాద్ - పెద్దింటి నవీన్ కుమార్


19 స్థానాలు పెండింగ్


తెలంగాణలో ఇప్పటివరకూ 100 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 19 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ - జనసేన పొత్తు నేపథ్యంలో ఇప్పటికే 8 చోట్ల సీట్ల సర్దుబాటు కుదిరింది. కానీ శేరిలింగంపల్లి విషయంలో జనసేన గట్టిగా పట్టుబడుతోంది. అయితే, ఈ టికెట్‌ ను తన అనుచరుడికి ఇప్పించుకునేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రవికుమార్‌ కోసం లాబీయింగ్ చేస్తుంటే, యోగానంద్‌ కూడా టికెట్ కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు రెబల్‌గా మారే అవకాశం ఉంది. ఒక వేళ అధిష్టానం జనసేనకే ఈ సీటు కేటాయిస్తే ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.


42 మందితో బీజేపీ ప్రచారకర్తల జాబితా


మరోవైపు, 42 మందితో తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారకర్తల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలుత 40 మందితో జాబితా రిలీజ్ చేయగా, సీనియర్ నాయకురాలు విజయశాంతి పేరు లేదు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లగా తాజాగా విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరును జాబితాలో చేర్చారు. 


ప్రచారకర్తల జాబితాలో రాష్ట్ర నాయకులు వీరే


కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్, విజయశాంతి, రఘునందన్ రావు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు.


ప్రచారకర్తల జాబితాలో జాతీయ నాయకులు వీరే


ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యడ్యూరప్ప, యోగీ ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవి కిషన్, పురంధేశ్వరి ఉన్నారు.


Also Read: Congress Third List Controversy: కాంగ్రెస్ లో మూడో జాబితా చిచ్చు - పటాన్ చెరులో ఉద్రిక్తత, జాబితాపై దామోదర రాజనర్సింహ అసంతృప్తి