Polling Ends in Telangana- తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా, ఆ సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 47.88 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.


కామారెడ్డి జిల్లా దోమకొండలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్సై గణేష్ దాడి చేశారు. ఎస్సై తీరును వ్యతిరేకిస్తూ రెండు పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్ద ఆందోళనకు దిగారు. ఎస్సైపై చర్యలకు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పిప్రియాల్ తండాలో 3 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. తమ సమస్యలు పరిష్కరించడం లేదని తండా వాసులు ఓటింగ్ ను బహిష్కరించగా, అధికారులు సర్దిచెప్పడంతో పోలింగ్ బూత్ లకు గిరిజనులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలోని కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 5 వరకు 69.83 శాతం పోలింగ్ నమోదైంది. 


వరంగల్ లో డిప్యూటీ మేయర్ భర్త డబ్బులు పంచుతూ దొరికిపోయారు. బీఆర్ఎస్ నేత మసూద్ నుంచి పోలీసులు రూ.47 వేలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే ఓటరు ఓటు వేస్తూ ఫొటో తీసుకున్నాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదుతో జయరాజ్ పై కేసు నమోదు చేశారు.


గుండెపోటుతో మహిళ మృతి
హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. భరత్ నగర్ కు చెందిన విజయలక్ష్మి ఓటు వేసేందుకు ఉప్పల్ పోలింగ్ కేంద్రానికి వచ్చి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయారని నిర్ధారించారు.