Venkaiah Naidu Visits Tirumala:
తిరుపతి : నీతి, నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులను ఎన్నుకోవడం భారతీయ పౌరులుగా అందరి బాధ్యత అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవినీతి పరులు రాజకీయాల్లో పుంజుకుంటున్నారని, ఇది సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం న్యూఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకి కోలా ఆనంద్, భాను ప్రకాష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారికి వచ్చే ఆదాయం ఆలయ పరిసరాల శుభ్రతకు, పురాతన ఆలయాలకు కైంకర్యాలకు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని ఆయన టీటీడీ ()TTDని కోరారు. శ్రీవారి ఆదాయం ప్రతి రూపాయిని తిరుమల అభివృద్ధి కోసమే వాడాలని సూచించారు. ఆలయ నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి నిధులు వాడాలన్నారు. గ్రామాల్లో టీటీడీ సహకారంతో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుమల పేరుతో కళ్యాణ మండపాలు, దేవాలయ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని టీటీడీకి సూచించారు. ధర్మ పరిరక్షణతో పాటు ప్రజలకు ప్రార్థనాలు, ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడానికి తిరుమల శ్రీవారి ఆలయం నిధులు వెచ్చించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం లాంటి కొన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టాలని కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, శ్రీవారి ఆలయం నిధులపై బయటి వ్యక్తులు జోక్యం చేసుకోకూడదని సూచించారు.
ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యువత, ఓటు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నీతి నిజాయితీగా నిక్కసుగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి పరులు రాజకీయాల్లో పుంజుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంచి నాయకుడిని ఓటు వేసి ఎన్నుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా మన అందరి మీద ఉందని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోకూడదని చెప్పారు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, ధనం చూసి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రజలకు సమస్యలు తప్పవన్నారు. గుణం, నేత వ్యక్తిత్వం వాళ్లు చేసే మంచి పనులు చూసి ఓటు వేసి గెలిస్తే మెరుగైన సమాజం ఉంటుందని, లేకపోతే అయిదేళ్ల పాటు ప్రజలు నష్టపోతారని సూచించారు. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షాల నేతలు ఎవరు ప్రజల కోసం ఏం చేశారు. ఓట్లకు డబ్బు ఆశ పడకుండా, నీతి, నిజాయితీగా ఉండే వారిని గెలిపించుకోవాలన్నారు. చెప్పిన హామీలు నెరవేర్చారా, మాట నిలబెట్టుకునే వ్యక్తులా కాదా అని చూసి ఓటు వేయాలని ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక సూచనలు చేశారు.
Also Read: కేసీఆర్ గుడ్‌విల్ సున్నా- కాంగ్రెస్‌కు చాన్సివ్వాలన్నది ప్రజల నిర్ణయం - రేవంత్ కీలక వ్యాఖ్యలు