Telangana Elections 2023: రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపించిందని, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆలంపూర్ (Alampur)నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభ నిర్వహించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎమ్మెల్యే సంపత్ హయాంలో జరిగిందేనని అన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును కట్టే వరకు కొట్లాడింది సంపత్ అని గుర్తు చేశారు.
‘‘జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ (KCR) ఆ హామీని తుంగలో తొక్కారు. పగవాడు ఉన్నా ఆ గుడి పరిస్థితి ఇలా ఉండేది కాదు. కేసీఆర్ (KCR)కు చీము నెత్తురు ఉంటే.. 3 గంటల కరెంటు ఇస్తామన్నామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందో నిరూపించు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది. 24 గంటల కరెంట్ అని కేసీఆర్ (KCR) చెబుతుండు. నేను సూటిగాసవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం. నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్ నామినేషన్ వేయం. లేకపోతే నడిగడ్డలో మీరు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా? దొరగారి దొడ్లో జీతగాడిగా బతకడమేనా వెంకట్ రామిరెడ్డి ఆత్మగౌరవం’’
‘‘ఇదేనా నడిగడ్డ పౌరుషం... ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. మీ బిడ్డగా చెబుతున్నా అధికారంలోకి రాగానే బోయలకు ఎమ్మెల్సీ ఇస్తాం. నల్లమల్ల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాది. ఇది మన పాలమూరు బిడ్డల జీవన్మరణ సమస్య... ఆత్మగౌరవ సమస్య. కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ను చంపేందుకు భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి. ధరణి (Dharani) లేకపోయినా వైఎస్ హయాంలో రైతులకు ఆర్ధిక సాయం అందలేదా? ధరణి (Dharani) స్థానంలో మెరుగైన సాంకేతికతతో కొత్త యాప్ తీసుకోస్తాం. రైతుల భూములు కాపాడుతాం. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు.