Telangana Elections 2023 : తెలంగాణ బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 35 మంది అభ్యర్థులుక చోటు దక్కంది. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి రెండో జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు బాబూమోహన్ పేరుతో ఈ జాబితాలో ఉంది. అయితే జనసేనతో పొత్తు పై స్పష్టత ఉన్నా కేటాయించాల్సిన సీట్లపై తర్జన భర్జన కొనసాగుతూండటంతో.. కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముఖ్యంగా గ్రేటర్ పరిదిలోని నియోజకవర్గాలను పక్కన పెట్టారు.
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎప్పుడూ పోటీ చేసే నియోజకవర్గం అంబర్ పేట నుంచి ఈ సారి ఆయన పోటీ చేయడం లేదు. మాజీ మంత్రి క్రిష్ణాయాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ లో హైదరాబాద్ లో కీలక నేతగా కృష్ణాయాదవ్ ఉండేవారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించేవారు. అయితే తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చిక్కుని చాలా కాలం పాటు మహారాష్ట్ర జైల్లో ఉన్నారు . దాంతో ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మరిపోయింది. ఆ కేసు నుంచి బయటపడి వచ్చే సరికి.. తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. బీఆర్ఎస్‌లో చేరినా గుర్తింపు లేకపోవడంతో ఇటీవలే బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు టిక్కెట్ లభించింది.
మర్రి శశిధర్ రెడ్డి కి సనత్ నగర్ టిక్కెట్ కేటాయించారు. ఈ జాబితాలో పలువురు ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు ఉన్నారు. మాజీ జర్నలిస్టు సంగప్పకు.. నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కేటాయించారు. ఆయన బండి సంజయ్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. పలువురు సీనియర్లు పోటీకి వెనుకాడుతూండటంతో.. అభ్యర్థులను ఖరారు చేయడం బీజేపీ పెద్దలకు సమస్యగా మారింది. జనసేన పార్టీ గ్రేటర్ పరిధిలో ఎక్కువ సీట్లను కోరుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి వంటి స్థానాలను కోరుతోంది. అలాంటి చోట్ల.. బీజేపీకి బలమైన నేతలు ఉన్నారు. ఈ సీట్లను జనసేనకు కేటాయిస్తే.. తన దారి తాను చూసుకుంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో జనసేన సీట్లపై క్లారిటీ రాలేదు.
గ్రేటర్ తో పాటు.. ఉమ్మడి ఖమ్మంలో కొన్ని సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. జనసేన పార్టీతో కన్నా... ఆ పార్టీకి సీట్ల కేటాయింపు వల్ల సొంత పార్టీలోనే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో బీజేపీ నేతలు కసరత్తు చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. మొదటి జాబితాలో 52, రెండో జాబితాలో ఒక్క పేరు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మరో 35 పేర్లను ఖరారు చేశారు. మొత్తంగా 88 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా 31 సీట్లకు పెండింగ్ ఉన్నాయి. వీటిలోనే జనసేనకు సర్దుబాటు చేయాల్సి ఉంది.