హైదరాబాద్ లో చంద్రబాబు ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ర్యాలీ చేశారని బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ర్యాలీ ద్వారా 2 గంటల పాటు రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాదా సిటీ టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సుమారు 400 మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.


బేగంపేట నుంచి ర్యాలీగా


స్కిల్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన బుధవారం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి టీడీపీ శ్రేణులతో చంద్రబాబు ర్యాలీగా వెళ్లారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ చేశారని పోలీసులు తెలిపారు. 2 గంటలు రోడ్లపై అలా వెళ్లడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వెల్లడించారు.


అనుమతి తప్పనిసరి


భాగ్యనగరంలో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. అలాంటిది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని ప్రకారం టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోయినా, రిటర్నింగ్ అధికారి నుంచి ర్యాలీ కోసం తప్పనిసరిగా అనుమతి పొందాలి. 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి. అయితే, నిబంధనలు పాటించకపోవడంతో చంద్రబాబు ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు


మరోవైపు, చంద్రబాబు గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం వైద్య బృందం ఆయన నివాసంలో పరీక్షలు  నిర్వహించి ఆస్పత్రికి రావాలని సూచించింది. ఈ క్రమంలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు పూర్తైన అనంతరం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ నేత్ర పరీక్షలు చేయించుకుంటారని పేర్కొన్నాయి.


Also Read: 'తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీ నుంచి తప్పుకొంది?' - జనసేన తమ భాగస్వామ్య పార్టీ అన్న ఎంపీ లక్ష్మణ్