తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో చెప్పాలని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఇప్పటివరకూ కాంగ్రెస్ కు మద్దతిస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని, తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామని అన్నారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి వస్తుందని, అయితే, రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా దేశ ప్రయోజనాలు సైతం చూస్తామని పేర్కొన్నారు. 


'ప్రజల ఓట్లు మాతోనే'


తెలంగాణ ప్రజలు వారి ఓట్లు తమతోనే ఉన్నాయని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. నేతలు పార్టీ వీడినంత మాత్రాన బీజేపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. పరస్పర లాభం ఉంటేనే పొత్తులుంటాయని, రాష్ట్రంలో జనసేనతో పొత్తు బీజేపీకి లాభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం ఉంటుందని స్పష్టం చేశారు. 


రాహుల్ పై విమర్శలు


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీలంటే చిన్న చూపని, బీసీని సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు బీసీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీని సీఎంను చేస్తామంటూ బీజేపీ చేసిన ప్రకటనపై రాహుల్ విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. 'ఓబీసీని ప్రధానిగా చేసింది బీజేపీ. 163 మంది బీసీలను ఎమ్మెల్సీలుగా చేసిన పార్టీ బీజేపీ. రాహుల్ గాంధీ బీసీలను అవమానించారు. అవకాశం ఉన్నా కాంగ్రెస్ బీసీలకు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. బీసీల ఆత్మ విశ్వాసాన్ని మేము కాపాడతాం. రెండో జాబితాలో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తాం. బీసీలు బీజేపీకి దగ్గరవుతారనే అక్కసుతోనే రాహుల్ అలా మాట్లాడారు. బీసీలు ఓటు అనే వజ్రాయుధంతో రాహుల్, కేసీఆర్ చేసిన కుట్రలు తిప్పికొట్టాలి.' అని లక్ష్మణ్ కోరారు.


బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అని లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో హస్తం పార్టీకి డిపాజిట్ గల్లంతైందన్న విషయాన్ని రాహుల్ గుర్తించుకోవాలన్నారు. ఓట్ల కోసం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలను రాహుల్ విరమించుకోవాలని హితవు పలికారు. భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సేనని, అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలని ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామని రాహుల్ చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 1358 ఓబీసీ శాసన సభ్యులు బీజేపీ తరఫున గెలిచారని, 160 మందికి శాసన మండలి సభ్యులుగా అవకాశం ఇచ్చామని లక్ష్మణ్ వెల్లడించారు. 


7న బీసీ ఆత్మగౌరవ సభ


ఈ నెల 7న బీసీల ఆత్మ గౌరవ సభ పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తున్నామని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ ఈ సభకు హాజరు కానున్నారని వెల్లడించారు. పసుపు రైతులకు న్యాయం చేకూరేలా, పసుపు బోర్డు తెలంగాణలోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపైనా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.


Also Read: బీసీ నేతను సీఎంగా ప్రకటించే దమ్ముందా? - రాహుల్‌కి బండి సంజయ్ సవాల్