మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన అంశంలో కేసీఆర్ వివిధ కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. బాంబులు పెట్టి బ్యారేజీ దెబ్బతినేలా చేశారని అంటున్నారని, బాంబులు పెట్టి ఉంటే శకలాలు పైకి ఎగురుతాయని అన్నారు. అంతేకానీ, భూమిలోకి కుంగిపోవని చెప్పారు. అసాంఘిక శక్తులు బ్యారేజీకి ఏదైనా హాని తలపెడితే అది కుంగిపోదని అన్నారు. ఇల్లు కట్టుకుంటేనే భూ పరీక్ష చేస్తుంటారని, అలాంటిది మేడిగడ్డ ప్రాజెక్టు కట్టేటప్పుడు భూ పరీక్షలు, సాంకేతిక జాగ్రత్తలు తీసుకోరా అని ప్రశ్నించారు. గాలిలో మేడలాగా కట్టేశారని అన్నారు. ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో రేవంత్‌ మాట్లాడారు.


ఆ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని కాపాడేందుకు సంఘ విద్రోహ శక్తులపై నేపాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. నివేదికను ఎందుకు కేంద్రం బయటపెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, మోదీల లాలూచీ బయటపడిందని అన్నారు. 


కేసీఆర్ పై పోటీకి సిద్ధమే
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పైన కామారెడ్డిలో పోటీ చేయడానికి సిద్ధమేనని అన్నారు. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీకి తాను సిద్ధమని తెలిపారు. తాను లేదంటే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసీఆర్‌పై పోటీ చేస్తామని చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు రెడీగా ఉన్నామని.. కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించానని అన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదని.. తెలంగాణలోనూ హంగ్‌ ఎప్పుడూ రాలేదని అన్నారు. రెండింట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. 


ఎన్నికల కోడ్ ను బీఆర్ఎస్ నేతలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని.. పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని అన్నారు.


కాంగ్రెస్ లోకి వస్తే సాదర స్వాగతం
ఎన్నికల వేళ బీజేపీ వాటి అనుబంధ సంస్థలను పంపించడం ఆనవాయితీగా వస్తున్నదే అని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారో ఆయనే చెప్తారని.. వారికి ఆ స్వేచ్ఛ ఉందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చర్యలు తీసుకుంటుందేమోననే కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి లాంటివారు బీజేపీలో చేరారని అన్నారు. అందులో చేరాకే బీఆర్‌ఎస్, బీజేపీల బంధంపై వారికి స్పష్టత వచ్చిందని అన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే కొంతమంది బీజేపీని వీడారని అన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చేవాళ్లను సాదరంగా ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. వారి స్థాయికి తగ్గట్లు వారిని గౌరవిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ చార్లెస్ శోబరాజ్ తరహావాళ్లని.. వాళ్లెప్పుడు వాళ్ళ తప్పులను ఒప్పుకోబోరని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు ఉండవని అన్నారు. తెలంగాణలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ లేదని చెప్పారు. ఢిల్లీలోని చక్రవర్తి మోదీకి కేసీఆర్ కప్పం కడుతున్నందుకే కాపాడుతున్నారని విమర్శించారు.