Madhya Pradesh Elections 2023:
నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యలు..
బీజేపీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాటియాలో ఓ పబ్లిక్ మీటింగ్‌లో సినీ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని పేరుని ప్రస్తావిస్తూ అభ్యంతరకరంగా మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెబుతూనే...హేమ మాలిని ప్రస్తావన తీసుకొచ్చారు.
"దాటియా ఎంత అభివృద్ధి చెందిందంటే...కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు. హేమమాలినితో డ్యాన్స్ కూడా వేయించేంత అభివృద్ధి సాధించాం"
- నరోత్తమ్ మిశ్రా, మధ్యప్రదేశ్ మంత్రి
సోషల్ మీడియాలో వైరల్..
ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై ఇప్పటికే రాజకీయాలు మొదలయ్యాయి. జనతా దళ్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం అని మండి పడింది. మహిళలను ఇంత దారుణంగా కించపరచడమేంటని ప్రశ్నించింది.
"బీజేపీ నేతల దిగజారుడుతనానికి ఇంత కన్నా సాక్ష్యం ఇంకేమీ ఉండదు. పబ్లిక్‌గా ఓ మహిళ గురించి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎంపీ గురించి ఇలా మాట్లాడడం చాలా దారుణం"
- జేడీయూ
మాటల యుద్ధం..
దాటియా నియోజకవర్గం నరోత్తమ్ మిశ్రాకి కంచుకోట. ఇప్పటికే మూడు సార్లు పోటీ చేసి గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా నరోత్తమ్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. మహిళల పట్ల బీజేపీ నేతల సంస్కారం ఇలా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నవంబర్ 7వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.