Rahul Gandhi in Shadnagar: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాము చేసే మొదటి‌ పని ఓబీసీ గణన అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. 2024 లో దేశంలో‌ అధికారంలోకి వస్తే చేసే మొదటి పని అదేనని స్పష్టం చేశారు. షాద్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని మోదీని తాను పదే పదే ప్రశ్నించినందుకు తనపై 24 కేసులు పెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. ఆఖరికి తనకు ప్రభుత్వం ఇచ్చిన బంగ్లాను కూడా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తుందని అన్నారు. రైతుభరోసా కింద రైతులకు ఎకరానికి ఏటా రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేసి వారికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.4 వేల పింఛను ఇస్తామని తెలిపారు.


మహిళలు ఎంతో కష్టపడుతున్నారని.. తమ కుటుంబం కోసం కష్టపడే ప్రతి మహిళకు సహకారంగా వారికి ప్రతినెలా రూ.2500 వారి అకౌంట్లలో వేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచితే.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే తాము రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నెలకు రూ.2 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. 


కోచింగ్ సెంటర్లకు వెళ్లి తెలంగాణ యువత లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకురాబోతుందని హామీ ఇచ్చారు. యువ వికాసం కింద రూ.5 లక్షలతో కూడిన క్రెడిట్ కార్డు ఇస్తామని వెల్లడించారు. ఆ కార్డుతో విద్యార్ధులు కాలేజ్ ఫీజు, కోచింగ్ ఫీజు చెల్లించుకోవచ్చని చెప్పారు. మోదీ, కేసీఆర్ కలిసి విద్యారంగంలో ప్రైవేట్ వాళ్లనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ విషం చిమ్మితే తాను మాత్రం ప్రేమను పంచుతున్నానని అన్నారు. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 


రేపు మంథనిలో రాహుల్ పర్యటన


రేపు (నవంబర్ 2) మంథని నియోజకవర్గంలో రాహుల్‌‌ గాంధీ పర్యటించనున్నారు. నెల రోజుల వ్యవధిలో రాహుల్ మంథనిలో పర్యటించడం ఇది రెండోసారి. తొలుత హెలికాప్టర్‌లో రాహుల్‌ గాంధీ అంబట్‌ పల్లికి చేరుకొని.. అంబట్‌పల్లిలో ఉదయం 7.30 గంటలకు కొత్త గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో రాహుల్‌ పాల్గొననున్నారు. సుమారు 5 వేల మంది మహిళలతో ఈ సభను ప్లాన్ చేశారు. ఆరు గ్యారంటీ పథకాలపై మహిళలకు రాహుల్‌ వివరిస్తారు. సభ తర్వాత దెబ్బతిన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించనున్నారు. అయితే, పోలీసులు అక్కడికి అనుమతిస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇప్పటికే బ్యారేజ్ వద్ద 144 సెక్షన్‌ విధించారు. రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు.