KCR in Yellandu: ఓటు సరైన వ్యక్తికి వేస్తున్నామా? సన్నాసికి వేస్తున్నామా ఆలోచించండి - కేసీఆర్

ABP Desam Updated at: 01 Nov 2023 06:16 PM (IST)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.

కేసీఆర్

NEXT PREV

ప్రజలు తమ ఓటును సరైన వ్యక్తికి వేస్తున్నామా? లేక సన్నాసికి వేస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. లేదంటే ఓడిపోయేది ప్రజలే అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టినవి పది పథకాలైతే.. చేసినవి మాత్రం వంద‌ పథకాలని అన్నారు. ద‌ళిత‌బంధు పెట్టాలని తమకు ఎవ‌రూ చెప్పలేదని అన్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామ‌ని కూడా తాము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టలేదని అన్నారు. కానీ, వాటిని అమలు చేశామని చెప్పారు. హైద‌రాబాద్‌లో తాము ప‌ని చేస్తున్నామంటే అది మీరు ధార‌పోసిన శ‌క్తేనని అన్నారు. మీ శ‌క్తి లేక‌పోతే మేం చేసేది ఏమీ లేదని అన్నారు. ఓటు వేసే ముందు నిజ‌మైన వ్యక్తి ఎవరో ఎంచుకోవాలని కేసీఆర్ సూచించారు.



హరిప్రియ నాయక్ నా బిడ్డ లాంటిది. నియోజకవర్గంలో ఆమె కోరిన పనులన్ని నేను చేస్తాను. గతంలో కూడా ఎన్నో పనుల్ని నాతో గొడవ పెట్టుకొని పనులు చేయించుకున్నారు.-


అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ ఏది దాని చరిత్ర ఏది అనేది ముఖ్యమని కేసీఆర్ అన్నారు. ప్రజ‌ల గురించి పార్టీ విధానాలేంటో తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేల‌ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ‌తుందని.. మంచి ప్రభుత్వం గెలిస్తే మంచి ప‌నులు జ‌రుగుతాయని చెప్పారు. చెడ్డ ప్రభుత్వం గెలిస్తే చెడ్డ ప‌నులు జ‌రుగుతాయని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాల‌న చ‌రిత్ర మీకు తెలుసు కదా అని అడిగారు. ఎవరెవరు ఏం చేశారో మీకు తెలుసు కదా అని అడిగారు.


వ్యవ‌హార‌శైలి, న‌డ‌క‌లు, వారు అవ‌లంభించిన ప‌ద్దతులు మీ ముందే ఉన్నాయని, ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం కావొద్దని సూచించారు. ఎవరికి ఓటు వేస్తే లాభం కలుగుతుందో వారికి ఓటు వేయాలని చెప్పారు. ఓటును అల‌వోక‌గా వేయొద్దని.. త‌మాషా కోసం వేయొద్దని సూచించారు. ఈ దేశంలో ప్రజ‌ల చేతిలో ఉన్న వ‌జ్రాయుధం ఓటు అని.. మీ త‌ల‌రాత మార్చేది.. భ‌విష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే అని అన్నారు.



కర్ణాటక నుంచి ఓ పెద్ద మనిషి వచ్చిండు. అక్కడ డిప్యూటీ సీఎం అట. కేసీఆర్‌ నీకు కావాలంటే బస్సుపెడతం నువ్వు వచ్చి కర్ణాటకలో చూడు.. అక్కడ రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నమని చెప్తున్నడు. ఓ సన్నాసి మేం ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నం.. నువ్వే వచ్చి ఇక్కడ చూడాలి. కర్ణాటకకు వచ్చి మేం చూసేది ఏమున్నది. కాంగ్రెస్‌ నేతలు కరెంటు 3 గంటల ఇస్తే సరిపోతుందని మాట్లాడుతున్నరు. మరి సరిపోతదా మూడుగంటలు?- కేసీఆర్


జర ఇజ్జత్ షరమ్ ఉండాలి కదా
‘‘ప్రజల పన్నుల డబ్బు మొత్తం రైతు బంధుకు తగలేస్తున్నరని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నడు. రైతులకు డబ్బులు ఇచ్చుడు దుబారానా? రైతు బంధు ఉండాలా వద్దా? రైతులకు కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుల వారు అంటరు. మాట మాట్లాడితే మనుషులకు కొంచెం ఇజ్జత్‌.. షరం ఉండాలే కదా’’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Published at: 01 Nov 2023 05:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.