KTR Comments on Telangana Develepment: తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి సాధించినట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. తొమ్మిదన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై హైదరాబాద్ (Hyderabad)లోని హోటల్ కాకతీయలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని సాధించామని వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎంతో వృద్ధి సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్న కేటీఆర్, ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మీ బ్యారేజీకి మరమ్మతు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, దీనిపై చర్చకు సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తమకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా.? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
మిషన్ భగీరథకు రూ.37 వేల కోట్లు
బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, ఇందుకోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని, దీని స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. కాలువలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
'రాజకీయాల కోసం బద్నాం చెయ్యొద్దు'
కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాల కోసం బద్నాం చెయ్యొద్దని కేటీఆర్ కోరారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో సమస్యలు సర్వ సాధారణమని.. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయని తెలిపారు. సాగర్ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని చెప్పారు. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయన్నారు. రైతుల ఆదాయం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, పాడి పంటలపై దృష్టి సారించి వ్యవసాయాన్ని పండుగ చేసినట్లు వివరించారు. కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కామధేను, కల్పతరువు అని దేశంలో ప్రతి ఒక్కరూ చెప్పక తప్పని పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. హరితహారం కింద 273 కోట్ల మొక్కలు నాటామని, అటవీ విస్తరణ పెంపులో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని స్పష్టం చేశారు.
'పలకతో రండి పట్టాతో వెళ్లండి'
'పలకతో రండి పట్టాతో వెళ్లండి' అనేది కేజీ టు పీజీ విద్య లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలల స్థానంలో కొత్త బడులు కట్టించినట్లు చెప్పారు. అందరికీ వైద్యం అందుబాటులో ఉంచామని వెల్లడించారు. 'ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం. ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం. ఐటీ ఎగుమతులు రూ. 57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని తీసుకెళ్లాం. నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం.' అని వివరించారు.
కాంగ్రెస్ పై విమర్శలు
ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 'ధరణి' తీసేస్తామంటున్నారని, అలా చేస్తే పట్వారీ వ్యవస్థ మళ్లీ వస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రజలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉంటే రాష్ట్రంలో అంధకారంలో ఉంటుందని, హస్తం పార్టీకి పవర్ ఇస్తే, ప్రజల పవర్ తీసేస్తారని ఎద్దేవా చేశారు. కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read: Telangana Elections 2023: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఈడీ సోదాలు - ఆ రూ.100 కోట్లు బదిలీ వెనుక!