ED Raids on Ex MP Vivek: మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి (Vivek venkat swamy) ఇళ్లు, కార్యాలయంలో మంగళ, బుధవారాల్లో ఈడీ అధికారులు (ED Raids) దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో ఆ సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా తాజాగా రూ.100 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ దర్యాప్తు తేలింది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు ఈ సొమ్ము తరలింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది. హైదరాబాద్, రామగుండం, మంచిర్యాలలోని వివేక్ కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, చెన్నూరు, బెల్లంపల్లి ఇలా 9 చోట్ల ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ (Vigilance Securities Institute) తన వ్యాపార కార్యకలాపాల ద్వారా సుమారు రూ.20 లక్షల ఆదాయం పొందినట్లు బ్యాలెన్స్ షీట్లలో వెల్లడించినట్లు ఈడీ గుర్తించింది. మొత్తంగా సంస్థలో రూ.200 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. అయితే విశాఖ ఇండస్ట్రీస్‌తో విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవని ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ సైతం వివేక్ నియంత్రణలోనే ఉన్నట్లు బహిర్గతమైంది.
మాతృసంస్థగా యశ్వంత్ రియల్టర్స్
విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థగా ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో అధిక శాతం వాటాలు ఓ విదేశీయుడి పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విదేశీ సంస్థలో విజిలెన్స్ సెక్యూరిటీస్‌ను విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. గ్రూపు సంస్థల ఆస్తి ఒప్పందాల్లో లెక్కల్లో లేని నగదును వినియోగించినట్లు వెల్లడైంది. ‘విజిలెన్స్’ సంస్థ పేర్కొన్న చిరునామాల్లో దాని ఉనికే లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు.
ఈడీ చేతికి కీలక పత్రాలు
మరోవైపు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కుంభకోణంపై ఈడీ దర్యాప్తులో వివేక్ సంస్థకు చెందిన లింకులు బహిర్గతమైనట్లు తెలుస్తోంది. విశాఖ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల స్థిరాస్తి వ్యాపార లావాదేవీల పత్రాల ఈడీకి చిక్కాయి. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ కాంట్రాక్టు పనుల్లో రూ.20 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. వీటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, హెచ్‌సీఏ పూర్వ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్, హెచ్‌సీఏ పూర్వ ఉపాధ్యక్షుడు శివలాల్‌యాదవ్, పూర్వ కార్యదర్శి అర్షద్ అయూబ్ ఇళ్లతో పాటు ఎస్‌ఎస్ కన్సల్టెంట్స్ కార్యాలయం, ఆ సంస్థ ఎండీ సత్యనారాయణ నివాసం తదితర ప్రాంతాల్లో ఇటీవల సోదాలు నిర్వహించింది. డిజిటల్ పరికరాలు, పలు పత్రాలు, రూ.10.39 లక్షల నగదును సీజ్ చేసింది. వినోద్‌కు చెందిన ఓ ఇంటిని ఆయన సోదరుడు వివేక్ తన విశాఖ ఇండస్ట్రీస్ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఈడీ తేల్చింది.
ఇదీ జరిగింది
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Vivek Ventakaswamy) ఇంట్లో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్‌లో రూ.8 కోట్లను ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా బదిలీ చేసినట్టు ఈసీకి ఫిర్యాదు అందింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో దర్యాప్తు చేసిన సైఫాబాద్ పోలీసులు, బేగంపేట్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన రూ.8 కోట్లను ఫ్రీజ్ చేశారు. దీనికి సంబంధించి ఈడీ, ఐటీ అధికారులకు సమాచారం అందించడంతో మంగళ, బుధవారాల్లో తనిఖీలు జరిగాయి.