Khammam Elections News: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)కి ఎదురుదెబ్బ తగిలింది. పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీఆర్ఎస్‌ (BRS)లో చేరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ (CM KCR)ను కలిశారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌(Sambhani Chandrasekhar), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ, మానవతారాయ్‌, వెంకట్‌గౌడ్‌, అబ్బయ్య దంపతులు, రామచంద్రు నాయక్‌కు కేసీఆర్‌ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 13న దమ్మపేటలో జరగనున్న కేసీఆర్ సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. 


బీఆర్ఎస్‌ కండువా కప్పుకున్న నందు జనార్ధన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్ రెడ్డి(Nandu Janardhan Reddy) శుక్రవారం తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్(Minister KTR )సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతి భవన్‌లో జరిగినే ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ గులాబీ  కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  గత సోమవారం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు సొంత డబ్బు రూ. కోటి ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో సిద్దాంతాలు లేవని, డబ్బులు తీసుకుని పైరవీకారులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. 


బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) సమక్షంలో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ ముషీనము శ్రీనివాస్ (మాంగోలు), కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ఎస్‌యూఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావణ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కెసిఆర్ చేతుల్లో తెలంగాణ అంత సురక్షితంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ... అధికారం మీద యావ ఎక్కువ అని విమర్శించారు.


ఉమ్మడి జిల్లాలో పది కి పది మనమే గెలవబోతున్నామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగానలో గత 8 ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. రైతు బంధు సృష్టి కర్త కేసీఆర్ అన్నారు. నేడు తెలంగాణలో రెండు పంటలు పక్కాగా పండుతున్నాయని అది కేసీఆర్ ఘనత అన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు, చెక్ డ్యామ్‌లు, వాగులు వంకలు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రజల కోసం కేసీఆర్ బీమా, 400 లకే గ్యాస్ సిలెండర్ అందించనున్నట్లు చెప్పారు.


ఎమ్మెల్యే సైది రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు
హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) ఆధ్వర్యంలో గ్రామస స్థాయి నాయకులు పలువురు బీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు కేశబోయిన కృష్ణయ్య తన అనుచరులు, గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.