Hanumantharao On CM Position: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) నామినేషన్ సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Hanumantharao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఎవరికి వారే సీఎం అంటున్నారని, అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని పిలుపునిచ్చారు. 'కాంగ్రెస్ నేతలు నేనే సీఎం అనడం మానేయాలి. ఠాక్రేజీ (Thakre).. నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పండి. సీఎంను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయింది. ముందు ఎన్నికల్లో పార్టీని గెలిపించండి. తర్వాత సీఎం పంచాయతీ. ప్రజల్లో ఎవరికి క్రేజ్ ఉందో చూసి రాహుల్, సోనియా గాంధీ నిర్ణయిస్తారు.' అంటూ పార్టీ నేతలకు వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


'నేను సీఎం అవుతా'


కాగా, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క సైతం సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏదో ఓ రోజు సీఎం అవుతానని, కానీ తనకు సీఎం కావాలనే ఆశ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో నామినేషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని, రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. పోలింగ్ కు ముందు రైతు బంధు వేస్తారని, దాన్ని చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని, ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


'హైకమాండ్ ఆదేశిస్తే సీఎం అవుతా'


అటు, ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక ఎస్సీ, ఎస్టీ, ఓ మహిళ, ఓసీ సీఎం కావొచ్చన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ కుటుంబసభ్యులే సీఎం అవుతారని అన్నారు. తన బలం, బలహీనత మొత్తం పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలేనన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు అధికార పార్టీల నేతలు ములుగులో తిష్ట వేశారని, కరోనా వచ్చినప్పుడు, వరదల సమయంలో ఏ ఒక్కరూ ఇటువైపు చూడలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న ఆమె, తాను సుఖపడటానికి రాజకీయాల్లోకి రాలేదని ఆ విషయం నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసన్నారు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించింది, భూములు పంచింది కాంగ్రెస్ పార్టీయేనన్న సీతక్క.. పోడు భూముల చట్టాలు తెచ్చింది, ఏడు విడతలు బడుగు, బలహీన వర్గాలకు భూమలు పంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పంచిన భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటోందన్నారు.


మరోవైపు, కాంగ్రెస్ గెలిస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని ఆయన అభిమానులు, కొంతమంది సీనియర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో వీహెచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  


Also Read: Kamareddy Politics: ఓ కుట్రతో సీఎం కామారెడ్డికి వస్తున్నడు, ఈ బరితెగించిన వ్యక్తిని భూమ్మీదే చూడలే - రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు