Telangana Elections 2023 :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న  వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ గుర్తుపై షర్మిల అసంతృప్తిగా ఉన్నారు.  మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ చీఫ్ షర్మిల సీఈసీ ఆశ్రయించినట్లుగా తెలు్సతోంది. తమ తమ పార్టీ చాయిస్ గా  బాల్,  అగ్గిపెట్టె గుర్తులు ఖాళీగా  ఉండటంతో ఈ రెండు గుర్తులలో ఏదో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని షర్మిల  సీఈసీని కోరారు.  బాల్ గుర్తుపై  వైఎస్ఆర్టీపీ  చీఫ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తో్ంది.  కాగా అంతకుముందు నాగలి గుర్తు కోసం వైఎస్ఆర్టీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకుంది. కానీ ఈసీ బైనాక్యూలర్స్‌నుకేటాయించింది.    వైఎస్ఆర్టీపీ అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించాల్సిందిగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించింది. 2023 నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా షర్మిల ప్రకటించారు.  పాలేరు నుంచి షర్మిల బరిలో దిగనున్నారు.                                 


తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌తో షర్మిల అనేకసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ట్రబుల్‌ షూటర్‌గా ఉన్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూడా అనేకసార్లు కలిశారు. షర్మిల డిమాండ్స్‌ విషయంలో తేడా రావడంతో విలీనం ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేయనున్నారు. ఆమె భర్త అనిల్‌, తల్లి విజయలక్ష్మి సైతం అసెంబ్లీ బరిలో దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం షర్మిల ప్రయత్నించారు. నాలుగు నెలలు ఎదురు చూసినా కూడా ఆ పార్టీ నుంచి అశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.                           


షర్మిల పార్టీకి అభ్యర్థుల సమస్య ఉంది.  పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో  నియోజకవర్గ స్థాయి నేతలు లేరు. మొదట్లో పార్టీలో చేరిన కొంత మంది పార్టీ మారిపోయారు. తొలి అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి ప్రకటించిన ఏపూరి సోమన్న కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ లో విలీనం అయితే..   అభ్యర్థుల సమస్య వచ్చేది కాదు. తమ పార్టీ వారికి కొన్ని సీట్లు ఇప్పించుకునేవారు. కానీ.. విలీనం చర్యలు విఫలం కావడంతో  షర్మిలకు సమస్యగా మారింది.