తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నిర్మల్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి ప్రచార జోరును మరింత పెంచనుంది. ఇప్పటికే ప్రచార పర్వంలో ముందున్న బీఆర్ఎస్, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నవంబర్ 2న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.
ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయ సమీపంలోని గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ కుటుంబ నేతలతో పాటు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసేలా చూడాలని పట్టణ అధ్యక్షులు, మండల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులకు సూచించారు.
గులాబీమయమైన నిర్మల్
సీఎం కేసీఆర్ ఎన్నికల సభకు నిర్మల్ ప్రాంతం గులాబీమయం అయింది. సీఎం రాక కోసం గులాబీ జెండాలతో స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభకు వాహనాలతో వచ్చే నాయకులు, ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కనే పార్కింగ్ స్థలాలను కేటాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు నిర్మల్ ను గులాబీమయం చేశారు.