Telangana Elections 2023 Amit shah Tour : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తోున్న షెడ్యూల్ మరోసారి మారింది.  షెడ్యూల్ ప్రకారం  శుక్రవారం రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో స్వల్ప మార్పులు జరిగాయి. మారిన షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారని బీజేపీ తెలిపింది. అనంతరం 12.50 కు గద్వాల సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నల్గొండ, వరంగల్ సభల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6.10 గంటలకు హోటల్ క్షత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.తర్వాత   ఎంఆర్పీఎస్ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 7:55 కి బేగంపేట విమానాశ్రయం నుంచి షా అహ్మదాబాద్ బయలుదేరనున్నారు.                           

  
  
మొదట షా రెండు రోజుల పర్యటన అని చెప్పి.. తాజాగా ఒక రోజుకి కుదించారు.  మధ్యప్రదేశ్,  చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూండటంతో  అక్కడ ప్రచారానికి  బీజేపీ అగ్రనేతలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నరు. అక్కడ ప్రచార గడువు పూర్తయిన తర్వాత తెలంగాణలోనే అగ్రనేతలంతా ప్రచారం చేసే అవకాశం ఉంది.  రాజస్థాన్ ఎన్నికల ప్రచారం నవంబర్ 23తో ముగుస్తుండటంతో తెలంగాణపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ఐదు రోజుల్లో 50 సభలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర ఏక్​నాథ్ షిండే, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా, నవంబర్ 19 నుంచి మూడు నాలుగు రోజులపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.           


షా పాల్గొనే సభలకు “సకల జనుల విజయ సంకల్ప సభగా బీజేపీ పేరు ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 19 న ఎన్నికల ప్రచార సభల్లో  పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లనున్నారు. ఆ సభ తర్వాత చేవెళ్లలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం మల్కాజిగిరిలో నిర్వహించే రోడ్​షోలో నడ్డా పాల్గొంటారు. తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రాత్రి 9 గంటలకు  ఢిల్లీ వెళ్లనున్నారు.


తెలంగాణ ప్రస్తుత రాజకీయంలో బీజేపీ ప్రచారంలో వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ తరపున కేసీఆర్, కేటీఆర్, కవిత , హరీష్ రావు  ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్, రేవంత్ రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున కిషన్ రెడ్డి ఆ స్థాయి అందుకోలేకపోతున్నారు. నియోజకవర్గ స్థాయిలో బహిరంగసభులు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అగ్రనేతలు రాక తర్వాత ఈ లోటు తీరుతుదంని బీజేపీ నేతుల బావిస్తున్నరు.