Telangana Nominations 2023: తెలంగాణలో నామినేషన్ల (Telangana Nominations) ఘట్టం తుది అంకానికి చేరుకుంది. గురువారం అధికార బీఆర్ఎస్ (BRS) సహా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు  సైతం నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే కొడంగల్ లో నామినేషన్ వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నేడు నామినేషన్ వేయనున్నారు. అటు, బీజేపీ 111 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. పలువురు స్వతంత్ర్య అభ్యర్థులు సైతం అధికారులను నామినేషన్లు సమర్పించారు. ఒక్కో అభ్యర్థి ముందు జాగ్రత్తగా ఒకటి కంటే ఎక్కువ సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఒక్కరోజే 1133 మంది ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. 


ఏ రోజు ఎన్నంటే.?


నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆ రోజున 96 మంది, 4వ తేదీన 139, 6వ తేదీన 211, 7న 281, 8న 618, 9న 1133 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకూ 2,478 మంది నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. 2,887 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. 


అఫిఢవిట్ లో పలువురు అభ్యర్థుల తప్పులు


నామినేషన్ల దాఖలు సందర్భంగా పలువురు అభ్యర్థులు అఫిడవిట్స్ అసంపూర్ణంగా సమర్పిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు స్వతంత్ర్య అభ్యర్థులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఓ అభ్యర్థి కేసుల వివరాలన్నీ రాసి, చివరికి డిక్లరేషన్ లో 'నిల్' అని రాసినట్లు సమాచారం. ఓ ప్రముఖ పార్టీ అభ్యర్థి 'నాట్ అప్లికేబుల్' అని నింపాల్సిన చోట అఫిడవిట్ లో ఖాళీగా వదిలేసినట్లు తెలుస్తోంది. మరో అభ్యర్థి క్వాలిఫికేషన్ దగ్గర ఖాళీగా వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. చాలా వరకు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థులు ఒకటికి పదిసార్లు తనిఖీ చేసి దరఖాస్తులు ఇవ్వాలని సూచిస్తున్నారు.


 


Also Read: Telangana BJP Candidate Final List: తెలంగాణలో పోటీకి 14 మందితో ఫైనల్‌ జాబితా విడుదల చేసిన బీజేపీ