Telangana Election 2023: 


ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్..


తెలంగాణ ఎన్నికలు (Telangana Election 2023) ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. అధికార BRS పార్టీ హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టిగానే కసరత్తు చేస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ రికార్డుకి బ్రేక్‌లు వేయాలని చూస్తోంది. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే ABP Cvoter Opinion Poll ఆసక్తికర విషయాలు వెల్లడించింది. BRS పార్టీకి గరిష్ఠంగా 61 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది. అటు కాంగ్రెస్ 43-55 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయితే...ఈ పోల్‌లో భాగంగా చాలా కోణాల్లో సర్వే చేపట్టింది ABP Cvoter.ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలేంటో వివరించింది. ఏయే అంశం ఎంత ప్రభావం చూపించనుందో లెక్కలతో సహా వెల్లడించింది. ఇందుకోసం తెలంగాణలో 9,631 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. 


ఏయే అంశాల ప్రభావం ఎంత..?


ఈ సారి తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగ సమస్య కీలకంగా ఉంది. నిరుద్యోగ సమస్య 22.5% మేర ప్రభావం చూపనుంది ఈ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. విద్యుత్, నీళ్లు, రహదారులు లాంటి మౌలిక వసతులు ఎన్నికలపై 2.5% ఎఫెక్ట్‌ చూపిస్తుందని తెలిపింది. శాంతిభద్రతలు, మహిళా భద్రతల ఎఫెక్ట్‌ 5.3% గా ఉన్నట్టు అంచనా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే....ఓవరాల్‌గా చూసుకుంటే అవినీతి అంశం ఎన్నికలపై 7% మేర ప్రభావం చూపిస్తుందని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. ఇక ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ 33.7% మేర ఉంటుందని తెలిపింది. ఇక మిగతా స్థానిక సమస్యల ప్రభావం 29.1% వరకూ ఉండొచ్చని తెలిపింది. 




ప్రభుత్వ వ్యతిరేకత ఎంత..?


ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సారి ప్రజలు అధికార మార్పిడి కోరుకుంటున్నారని అంటున్నాయి. ఈ కోణంలోనూ సర్వే చేయగా...ప్రస్తుత BRS ప్రభుత్వంపై ప్రజల్లో 57% మేర వ్యతిరేకత ఉన్నట్టు తేలింది. వీళ్లంతా కేసీఆర్ సర్కార్‌పై అసహనంతో ఉన్నట్టు వెల్లడైంది. అయితే...అసహనం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మార్చాలని అనుకోని వాళ్లూ ఉన్నారు. వీళ్ల సంఖ్య 8.7%గా ఉంది. ఇక ప్రభుత్వంపై ఏ మాత్రం వ్యతిరేకత లేని వాళ్ల సంఖ్య 34.3%గా ఉంది. 


ఏ పార్టీకి ఓటేయాలో డిసైడ్ అయ్యారా..?


ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారని సర్వే చేపట్టగా ఇప్పుడప్పుడే చెప్పలేం అని 3.4% మంది వెల్లడించారు. ఇక పోలింగ్ తేదీ రోజే నిర్ణయించుకుంటామని 9.4% మంది, ఓటింగ్‌కి ఓ వారం రోజులు ముందు డిసైడ్ అవుతామని 8.4% మంది చెప్పారు. ఓటింగ్‌కి నెల రోజుల ముందే డిసైడ్ అయ్యామని చెప్పిన వాళ్లు 4.9% మంది ఉన్నట్టు పోల్ వెల్లడించింది. ఎవరికి ఓటు వేయాలో చాలా క్లారిటీతో ఉన్నట్టు చెప్పిన వాళ్లు 61.9% మంది ఉన్నారు. అభ్యర్థుల జాబితా విడుదలైన తరవాత నిర్ణయించుకుంటామని చెప్పిన వాళ్లు 9.3% మంది ఉన్నట్టు ఈ పోల్ వెల్లడించింది. ఇక పార్టీల మేనిఫెస్టోని బట్టి ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకుంటామని చెప్పిన వాళ్లు 2.6%గా ఉన్నారు.


ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉందంటే..?


తమ నియోజకవర్గ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉందో అభిప్రాయాలు సేకరించింది ఒపీనియన్ పోల్. ఇందులో ఎటూ తేల్చని వాళ్లు 5.5% మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేనే మళ్లీ ఎన్నుకుంటామని 32.8% మంది చెప్పారు. ఎమ్మెల్యే పని తీరు బాగానే ఉన్నప్పటికీ...వేరే వ్యక్తికి ఓటు వేయాలని నిర్ణయించుకున్న వాళ్లు 7.1% ఉన్నారు. పూర్తిగా అసంతృప్తితో ఉన్న వాళ్ల సంఖ్య 53% మంది ఉన్నారు. అసంతృప్తిగానే ఉన్నప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యేకే ఓటు వేస్తామని 1.1% మంది వెల్లడించారు. అసలు తమ ఎమ్మెల్యే గురించి ఏమీ తెలియని వాళ్లు 0.6% మంది ఉన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది..?


తెలంగాణ ప్రభుత్వ పని తీరు చాలా బాగుందని 29.3% మంది చెప్పగా..కొంత వరకూ సంతృప్తిగానే ఉన్న వాళ్ల సంఖ్య 31.0%గా ఉంది. ఏ మాత్రం సంతృప్తి లేని వాళ్లు 36.1% మంది వెల్లడించారు. ఏమీ చెప్పలేమని 3.6% మంది స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవడం వల్ల అభివృద్ధి జరిగిందని 49.1% మంది వెల్లడించారు. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని చెప్పిన వాళ్ల సంఖ్య 31.5%గా ఉంది. లాభమూ లేదు, నష్టమూ లేదని చెప్పిన వాళ్లు 14.6% మంది ఉన్నట్టు ఈ ఒపీనియన్‌ పోల్‌లో తేలింది.