ఓటు హక్కు, ఐదేళ్లు మనల్ని పాలించే నేతలను మనమే ఎన్నుకునే ఓ గొప్ప అవకాశం. ముఖ్యంగా యువత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. 


ఆన్ లైన్ లోనే


తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడదల చేయడంతో అధికార యంత్రాంగం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల సన్నద్ధత వంటి అంశాలపై అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈసీ కొత్త ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతి ఒ క్కరూ ఓటెయ్యాలనే సంకల్పంతో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారు ఆలస్యం చేయకుండా ఆన్ లైన్ లో ఫారం - 6 నింపి ఓటరుగా నమోదు కావాలని అధికారులు చెబుతున్నారు.


2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫారం - 6పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఓటరుగా నమోదు కావాలని అధికారులు తెలిపారు. అక్టోబర్ 31 వరకే ఈ ఛాన్స్ అని, ఇప్పటివరకూ నమోదు చేసుకోని వారికి ఈ ఎన్నికలకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తున్నారు. 


యువత ఆసక్తి


కాగా, ఎన్నికల సంఘం సూచనలతో తెలంగాణలో యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదుపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజా ఓటర్ల జాబితా మేరకు రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 8.11 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య వీరిలో 66 శాతం మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంటే ఏకంగా 5.32 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గడువు పూర్తయ్యే లోపు యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.


ఏమైనా సందేహాలా!


ఓటరుగా కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్ ద్వారానే నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేవారు. అయితే, ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో ఆన్ లైన్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. దాంతో పాటే మీ సేవ కేంద్రాలు లేదా ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటరు నమోదులో ఏమైనా సందేహాలుంటే 1950 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేస్తే ఎలా నమోదు చేసుకోవాలి.? ఓటు ఉందా.? లేదా.? అనే అంశాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.


Also Read: తెలంగాణ ఎన్నికల్లో వారిదే కీలక పాత్ర- అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది వాళ్లే